గుజరాత్ లో మళ్ళీ బీజేపీ విజయకేతనం ఎగురవేసే సూచనలు కనిపిస్తున్నాయి. సోమవారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ను బట్టి చూస్తే గుజరాత్ లో బీజేపీ హవా కనిపిస్తుండగా , హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం ఈ పార్టీకి కాంగ్రెస్ గట్టి పోటీనిస్తోంది. పీపుల్స్ పల్స్, న్యూస్ ఎక్స్, టైమ్స్ నౌ, రిపబ్లిక్ సిఎన్ఎన్, రిపబ్లిక్ సర్వే, జన్ కీ బాత్ సర్వే వంటివాటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముఖ్యంగా బీజేపీ ఆధిక్యాన్ని సూచించాయి.
182 సీట్లున్న గుజరాత్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు ముగిశాయి. 68 స్థానాలున్న హిమాచల్ అసెంబ్లీకి ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. గుజరాత్ లో మళ్ళీ కమల వికాసం తప్పదని, అయితే హిమాచల్ లో మాత్రం బీజేపీకి కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ తలెత్తిందని ఈ ఫలితాలు వెల్లడించాయి. ఈ రాష్ట్రాల్లో ఆప్ మూడో స్థానంలో ఉన్నట్టు ఈ ఫలితాలు సూచించాయి.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వైపే ఓటర్లు మొగ్గు చూపినట్టు కనిపిస్తోంది. . ఈ నగరంలో ఆప్ క్లీన్ స్వీప్ చేయనుందని తెలుస్తోంది. ఇక్కడ ఈ పార్టీ 149 నుంచి 171 వార్డులను గెలుచుకోవచ్చునని ఆజ్ తక్ ఎగ్జిట్ పోల్ సర్వే తెలిపింది. టైమ్స్ నౌ విషయానికి వస్తే ఈ పార్టీ 146 నుంచి 156 వార్డులను దక్కించుకోవచ్చునట. నగర మున్సిపల్ కార్పొరేషన్ లోని 250 వార్డులకు ఈ నెల 4 న ఎన్నికలు జరిగాయి.
ఈ ఎన్నికల ఫలితాలను ఈ నెల 7 న ప్రకటించనున్నారు. అలాగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 8 న వెల్లడి కానున్నాయి.