మేఘాలయాకు ఫ్యామిలీ ఫస్ట్ అనే కాంగ్రెస్ కన్నా పీపుల్స్ ఫస్ట్ అనే బీజేపీ ప్రభుత్వం అవసరమని ప్రధాని మోడీ అన్నారు. తనకు మేఘాలయా ప్రజల నుంచి ప్రేమ, ఆశీర్వాదాలు లభించాయని ఆయన పేర్కొన్నారు. వాటిని తాను వృధా చేయనివ్వనని చెప్పారు.
మేఘాలయాను అభివృద్ధి చేయడం ద్వారా, ప్రజా సంక్షేమం కోసం ప్రాజెక్టులను వేగవంతం చేయడం ద్వారా వారి రుణాన్ని తీర్చుకుంటానని ఆయన తెలిపారు. మేఘాలయా రాజధాని షిల్లాంగ్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ రోజు పాల్గొని మాట్లాడారు.
దేశ ప్రజల చేత తిరస్కరించబడిన కొందరు వ్యక్తులు తాను చనిపోవాలని కోరుకుంటున్నారన్నారు. కానీ మోడీ కమలం (బీజేపీ గుర్తు) వికసించాలని ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడించారు. అలాంటి వారికి మేఘాలయా, నాగాలండ్ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.
రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని మేఘాలయాలో ప్రతి ఒక్కరూ అంటున్నారన్నారు. రాష్ట్రంలోని గత ప్రభుత్వాలు మేఘాలయను అభివృద్ధి చేయకుండా అత్యాశపై దృష్టి సారించాయని ఆరోపించారు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి మేఘాలయ, ఈశాన్య ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు చొరవ తీసుకున్న తర్వాత పరిస్థితులు మెరుగ్గా మారాయన్నారు.