– మరో మిలియన్ మార్చ్ కు బీజేపీ ప్రయత్నాలు
– కోటి సంతకాల సేకరణలో బిజీబిజీ
– టీఆర్ఎస్ సర్కార్ ను కూల్చే దిశగా బండి!
– అసెంబ్లీ టైమ్ లో మిలియన్ మార్చ్!
– యువత ఓట్లే టార్గెట్ గా అడుగులు
టీఆర్ఎస్ సర్కార్ ను ఏ విషయంలోనూ వదలడం లేదు బీజేపీ. రైతు సమస్యలను కేంద్రంపై వేస్తున్నారంటూ గులాబీ ప్రయత్నాలను గట్టిగానే తిప్పికొట్టింది. ఉద్యోగ, ఉపాధ్యాయులకు భరోసానిస్తూ పోరాటాలు సాగిస్తోంది. ఇక తమ పార్టీ నాయకులపై జరుగుతున్న దాడులను క్యాష్ చేసుకోవడంలోనూ సక్సెస్ అయింది. ఇంకొన్ని రోజుల్లో ప్రజాసంకల్ప యాత్ర రెండో దశ ప్రారంభించి ప్రజల్లోకి ఇంకా బలంగా వెళ్లాలని ప్రణాళికలు రచిస్తోంది. అయితే.. అంతకంటే ముందు మిలియన్ మార్చ్ నిర్వహించాలని గట్టి పట్టుదలతో కనిపిస్తోంది బీజేపీ.
ఇప్పటికే ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేపట్టింది. తొలి సంతకం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఈ సందర్భంగా తెలంగాణలో కొనసాగుతున్నవి నిరుద్యోగుల ఆత్మహత్యలు కాదని.. ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. వాటికి బాధ్యుడ్ని చేస్తూ సీఎం కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం అసెంబ్లీ సమావేశాల సమయంలో మిలియన్ మార్చ్ చేసి తీరుతామని స్పష్టం చేశారు బండి.
గతేడాది నవంబర్ లోనే రెండుసార్లు మిలియన్ మార్చ్ నిర్వహించాలని ప్రయత్నించారు సంజయ్. కానీ.. పలు కారణాలతో వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. టీఆర్ఎస్ పాలనలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేవని.. ఇస్తామన్న భృతి కూడా ఇవ్వడం లేదని నిరసిస్తూ నిరుద్యోగులతో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని చెబుతున్నారు బండి.
తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ కు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆనాడు ట్యాంక్ బండ్ మీద జరిగిన ఈ కార్యక్రయాన్ని రాష్ట్ర ప్రజలెవరూ మర్చిపోలేరు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై పోరాటానికి బీజేపీ అదే మిలియన్ మార్చ్ ను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఇటీవల నిరుద్యోగులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్యమం చేయాలని నిర్ణయించుకున్నారు సంజయ్. నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వ తీరును ఎండగడుతూ.. యువతలో ఉన్న అసంతృప్తిని మరింత రగిలించే ప్రయత్నం చేస్తున్నారు.
మరోవైపు బీజేపీ మిలియన్ మార్చ్ పై టీఆర్ఎస్ వైపు నుంచి కౌంటర్ ఎటాక్ కొనసాగుతోంది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని ఎన్నికల్లో గెలిచి ఇప్పటివరకు ఎన్ని ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేస్తోంది. మిలియన్ మార్చ్ తెలంగాణలో కాదు.. ఢిల్లీలో చేయాలని బీజేపీకి చురకలంటిస్తోంది టీఆర్ఎస్ వర్గం.