– రైతుల ఉసురు పోసుకుంటున్నారు
– కేసీఆర్ సర్కార్ కూలిపోవడం ఖాయం
– ఈటల జోస్యం
అత్తమీద కోపం దుత్త మీద చూపించినట్లు.. బీజేపీ మీద కోపాన్ని కేసీఆర్ రైతుల మీద చూపిస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ధాన్యం సేకరణ వ్యవస్థ ఈరోజు వచ్చింది కాదని.. ఎన్నో ఏళ్లుగా జరుగుతోందని వివరించారు. తెలంగాణ డీసెంట్రలైజెడ్ ప్రొక్యుర్మెంట్ పద్దతిలో ధాన్యం సేకరణ చేస్తోందని తెలిపారు. ఈ ప్రక్రియకు అవసరం అయిన డబ్బులు మొత్తం కేంద్రమే ఇస్తుందన్నారు. వడ్లు కొనడానికి, గన్నీ సంచులకు, సుతిల్ దారానికి, మహిళా సంఘాల కమీషన్ కు, ట్రాన్స్పోర్ట్ కు, నిల్వ ఉంచడానికి కిరాయికి, చివరికి వడ్డీ కూడా కేంద్రమే ఇస్తుందని వివరించారు. రాష్ట్రం ఏమీ ఖర్చు పెట్టదన్నారు. కానీ.. ఇన్ని రోజులు అన్నీ మేమే చేస్తున్నామని కేసీఆర్ చెప్పుకున్నారని మండిపడ్డారు.
దేశంలో వ్యవసాయ రంగం అత్యంత కన్ఫ్యూజన్ లో ఉంది ఒక్క తెలంగాణలో మాత్రమేనన్నారు ఈటల. రాష్ట్రంలో రైస్ మిల్లర్లు కేవలం కస్టమ్ మిల్లింగ్ మీద మాత్రమే ఆధారపడి ఉన్నారని.. తమకు సబ్సిడీ ఇవ్వండి, జాగ ఇవ్వండని వారు సీఎంని కోరారని చెప్పారు. ఆయన మీటింగ్ పెట్టారు గానీ.. ఏం చేయలేదని విమర్శించారు. తెలంగాణలో పండిన పంట మొత్తాన్ని మిల్లర్లు మిల్లింగ్ చేయలేరని.. కేసీఆర్ కు ముందుచూపు లేక, పట్టించుకోక ఇప్పుడు కేంద్రం మీదకు నెట్టివేసే నీచమైన స్థితికి దిగజారారని మండిపడ్డారు.
అధికార పార్టీ దాడులను ప్రోత్సహిస్తోందని.. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత తన మీద ఉందని కేసీఆర్ మర్చిపోతున్నారని అన్నారు ఈటల. ప్రజల మధ్య చిచ్చుపెట్టి, వారి రక్తం కళ్ళ చూస్తున్నారని ఫైరయ్యారు. ఆయన తప్పులను పక్కవారి మీద వేస్తున్నారని అన్నారు. కేంద్రం అయినా రాష్ట్రం అయినా ఇచ్చేది ప్రజల డబ్బేనని చెప్పారు. పెన్షన్ డబ్బులు కూడా మేమే ఎక్కువ ఇస్తున్నామని చెప్పుకుంటున్న కేసీఆర్.. రైతులకు ఇవ్వడానికి ఎందుకు మనసు రావడం లేదని ప్రశ్నించారు. వెయ్యి కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెడితే ఈ సమస్య తీరుతుందని సూచించారు. అది చెయ్యకుండా.. శకుని వేషాలు వేస్తున్నారని మండిపడ్డారు.
ఇంత సిగ్గు మాలిన, బేలతనం ఎందుకంటూ కేసీఆర్ పై ఆగ్రహించారు ఈటల. సీఎం ఇంత చేతగాని వాడా అని ప్రజలు అనుకుంటున్నట్లు చెప్పారు. సీఎం వద్దు అన్నారని.. రైతులు 20 లక్షల ఎకరాల్లో వరి పంట వేయలేదని.. నీళ్ళు ఉన్నా, కరెంట్ ఉన్నా వరికి దూరంగా ఉన్నారని తెలిపారు. కోటి ఎకరాలు అని చెప్పుకుంటున్నారు కదా.. వరి వేయనికాడికి ప్రాజెక్ట్స్ ఎందుకు కట్టినట్లు అని ప్రశ్నించారు. కరెంట్ ఎందుకు ఇస్తున్నారని నిలదీశారు. ఈ సీజన్ కూడా ఎంత అయినా రా రైస్ అయినా కొంటాం అని కేంద్రం చెప్పిందన్నారు.
“బాయిల్డ్ రైస్ ను కేరళ, తమిళనాడుకు గతంలో పంపేవారు.. కానీ ఇప్పుడు వారే వడ్లు పండించుకుంటున్నారు. రా రైస్ తింటున్నారు. మేము బాయిల్డ్ రైస్ ఇవ్వం అని రాష్ట్రం, కేంద్రానికి లేఖ రాసిన మాట వాస్తవం కాదా? ఆ లెటర్ మీరు రాసింది కాదా? ఇన్ని అబద్ధాలా? కేంద్రం కొన్నా కొనకపోయినా మేము కొంటాం అని చెప్పారు కదా. మరి ఇప్పుడు ఎందుకు తెలంగాణ రైతులు ఉసురు పోసుకుంటున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుందని వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
వర్షాకాలం, ఎండా కాలం రెండు పంటలు గింజ లేకుండా కొనే భాద్యత కేంద్రానిదన్నారు ఈటల. రాష్ట్ర రైతాంగాన్ని కాపాడుకుంటామని తెలిపారు. సీఎం ధాన్యం కొనుగోలు చేయాలని.. రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టొద్దన్నారు. ప్రతీది నెత్తి మీద దాకా తెచ్చుకోవద్దని హెచ్చరించారు ఈటల. ఇటు గిరిజన రిజర్వేషన్ కు సంబంధించి మాట్లాడుతూ… ఎస్టీల రిజర్వేషన్ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన మాట వాస్తవమేనని.. జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు.