రాష్ట్రాన్ని దోచుకునేందుకే కేసీఆర్ రాజ్యాంగం మార్చాలని అంటున్నారని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. మద్యం ఆదాయంతోనే రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు. కలెక్టర్లకు సీఎస్ ఫోన్ చేసి మరీ మద్యం అమ్మకాలు పెంచాలని ఆదేశాలు ఇస్తున్నారని అన్నారు.
టీఆర్ఎస్ ను బొంద పెట్టి బీజేపీని గెలిపించుకుంటామని చెప్పారు ఈటల. ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక కేంద్రంపై కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయన భరతం పట్టే సమయం దగ్గరపడిందని హెచ్చరించారు.
మోకాళ్ల మీద నడిచినా వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు ఓటమి తప్పదన్నారు ఈటల. ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు కేసీఆర్ కు బానిసలుగా మారారని… గంటల తరబడి సీఎం ప్రెస్ మీట్లకు హుజూరాబాద్ ఓటమే కారణమని చెప్పారు.
రాష్ట్రంలో తన పని అయిపోయిందని భావించే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సాయం తీసుకుంటున్నారని.. అతని కంటే తెలంగాణ ప్రజలే మేధావులని సెటైర్లు వేశారు రాజేందర్. చరిత్ర గతిని మార్చేది సలహాదారులు కాదు.. ప్రజలేనన్న సంగతి కేసీఆర్ మర్చిపోయారని విమర్శలు చేశారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఇచ్చిన ఏ హామీని కేసీఆర్ నెరవేర్చలేదని ఆరోపించారు ఈటల. ఎన్నికల తర్వాత దళిత బంధు ఇస్తానని.. ఇంకా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగాల్లేక, నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులకు భారం కాకూడదని నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తేనే కేసీఆర్ కు భవిష్యత్తు ఉంటుందని ఈటల హెచ్చరించారు. కేసీఆర్ మాట్లాడే భాషే.. తెలంగాణ సంస్కృతి అని నమ్మించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలనూ తన మోసపూరిత హామీలతో దగా చేస్తున్నారని మండిపడ్డారు ఈటల రాజేందర్.