– సారుపై సై అంటున్న ఈటల
– ఈసారి గజ్వేల్ నుంచి పోటీ
– గ్రౌండ్ వర్క్ ప్రిపరేషన్ లో రాజేందర్
– కేసీఆర్ సిద్దిపేటకు వెళ్తారని ప్రచారం
– మరి.. ఈటల కూడా అటే వెళ్తారా?
చేరికల కమిటీకి కన్వీనర్ అయ్యాక ప్రభుత్వంపై విమర్శల దాడిలో ఈటల రాజేందర్ స్పీడ్ పెంచారు. తాజాగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సర్కార్ పై మండిపడ్డారు. అయితే.. సమావేశం తర్వాత మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు ఈటల. ఈ సందర్భంగా కేసీఆర్ పై పోటీకి సై అని వ్యాఖ్యానించారు.
గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ముందే చెప్పానన్నారు ఈటల. దానికోసమే సీరియస్ గా వర్క్ చేస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ ను ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పశ్చిమ బెంగాల్ లో సీఎం మమతను సువేందు అధికారి ఎలా ఓడించారో.. తెలంగాణలోనూ అదే పునరావృతం అవుతుందని స్పష్టం చేశారు. అక్కడి మాదిరిగానే ఇక్కడ కూడా ముఖ్యమంత్రిని ఓడించాలని చెప్పారు.
ప్రస్తుతం ఈటల చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. అయితే.. కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గం మారతారనే ప్రచారం ఉంది. ఈసారి గజ్వేల్ నుంచి కాకుండా సిద్దిపేట నుంచి బరిలోకి దిగుతారని రాజకీయ వర్గాల్లో కొన్నాళ్లుగా చర్చ సాగుతోంది. తనయుడికి అడ్డుగా ఉన్న హరీష్ ను ఎంపీగా పోటీ చేయించి సైడ్ చేసి.. ఆ స్థానంలో ఆయన నిలబడతారని వార్తలు వచ్చాయి.
మరి.. కేసీఆర్ నిజంగా సిద్దిపేటకు వెళ్తే.. ఈటల కూడా అక్కడకు వెళ్తారా? లేక.. చెప్పినట్టుగానే గజ్వేల్ నుంచే పోటీ చేస్తారా? అనేది ఇప్పుడు ప్రశ్న. ఆయన మాటల్ని బట్టి చూస్తుంటే కేసీఆర్ ను ఓడించాలని అనుకుంటున్నారు కాబట్టి.. సీఎం ఎక్కడి నుంచి బరిలోకి దిగితే.. రాజేందర్ కూడా అక్కడ నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.