వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. వేధింపుల గురించి పోలీసులకు చెప్పినా ప్రయోజనం లేకపోయిందని ఆయన తెలిపారు. ఘటనలో పోలీసుల వైఫల్యం కూడా కొంత ఉందన్నారు.
ఈ రోజు ఆయన నిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్య విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి ఆయన తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… వైద్య కళాశాలల్లో నిగూఢంగా ఇంకా ర్యాగింగ్ కొనసాగుతోందని ఆయన ఆరోపించారు.
బాధిత కుటుంబానికి ఓదార్పునిచ్చే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గొప్ప డాక్టర్ కావాలని ఆ గిరిజన బిడ్డ కలలు కందన్నారు. సీనియర్లు, ముఖ్యంగా సైఫ్ ఇబ్బందులు పెడుతున్నట్లు హెచ్‌ఓడీకి ఆమె చెప్పినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.
మెడికల్ కాలేజీల్లో పీజీ చదివే విద్యార్థినిలపై కొందరు సైకోల్లాగా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు. అక్కడి హెచ్‌ఓవోడీలు సకాలంలో స్పందించి వుంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కావన్నారు. ప్రిన్సిపాల్ కూడా స్పందించకపోవడం చాలా బాధాకరమన్నారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ మూడు డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వైద్య కళాశాలలు పెరిగినంతగా అందులో బోధనా సిబ్బంది పెరగడం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పీజీ విద్యార్థులపై అధిక భారం పడుతోందన్నారు. తాజాగా వైద్య విద్యార్థిని హెల్త్ బులిటెన్‌ను నిమ్స్ వైద్య బృందం విడుదల చేసింది. ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.