పార్టీ అధ్యక్షుడి మార్పు ఉండదని హై కమాండ్ క్లారిటీ ఇచ్చిందని వెల్లడించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ తన శక్తి మేరకు పని చేస్తున్నారని చెప్పారు. ఇంకా పార్టీ విస్తరణ జరగాలని, కొత్తవాళ్లు పార్టీలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల ఏడాది నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడి మార్పు ఉండదని హై కమాండ్ క్లారిటీ ఇచ్చిందని చెప్పారు ఈటల. నేను నోరు తెరిచి ఏనాడూ పదవి అడగలేదు.. భవిష్యత్ లో కూడా అడగనని పేర్కొన్నారు.
మిత్రుడిగా చెబుతున్నా.. నీ పార్టీ నాయకులను కాపాడుకో అంటూ రేవంత్ రెడ్డికి సూచించారు ఈటల రాజేందర్. గెలిచిన వారిని రక్షించుకునే ప్రయత్నం చేయమని హితవు పలికారు. 111 జీవో పరిధిలో 18 వేల ఏకరాల ఆసైన్ మెంట్ ల్యాండ్స్ ఉన్నాయని తెలిపారు ఈటల. హైదరాబాద్ మహానగరాన్ని విధ్వంసం చేయవద్దని పేర్కొన్నారు. కేసీఆర్ సీఎంగా అన్నీ తనకే తెలుసు అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. 111 జీవో రద్దును విరమించుకోవాలని కోరుతున్నానన్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ పేదలకు లక్షలాది ఇల్లు కట్టించి ఇస్తున్నారని కొనియాడారు ఈటల. కానీ ఇక్కడ కేసీఆర్ గజం జాగా కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. మియాపూర్ లో 653 ఎకరాలు ఏమయ్యాయి?, మియాపూర్ భూ కుంభకోణం ఏమైంది? అని నిలదీశారు.
కూకట్ పల్లి ఎల్లమ్మ బండ భూమి కేసు.. ప్రభుత్వం ఎందుకు ఓడిపోయింది? ప్రశ్నించారు. కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన ఉండదు అంటూ సెటైర్లు వేశారు. సచివాలయంలోకి ఎమ్మెల్యేలకు కూడా అనుమతి లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్.