74వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా సిద్ధిపేట జిల్లా దుబ్బాకలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో జెండాను ఆవిష్కరించారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వోన్నత న్యాయస్థానం పరేడ్ గ్రౌండ్ లో జెండా వేడుకలు నిర్వహించాలనే మాటను సీఎం తుంగలో తొక్కారని మండిపడ్డారు. హైదరాబాద్ లో గవర్నర్ తో జెండా వేడుకలు జరపవద్దనే.. జిల్లాల్లో రద్దు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో రాజకీయాలు ఇంతగా దిగజార్చడం బాధాకరమన్నారు. ఈ అవమానం జాతీయ జెండాకు చేసినట్టే అని పేర్కొన్నారు. టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా మార్చి ఖమ్మంలో బహిరంగ సభ పెడితే కరోనా పాండమిక్ ఉండదా? మీ పుట్టిన రోజు సందర్భంగా సచివాలయం ప్రారంభిస్తామనకుంటే కరోనా రాదా? అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే రఘునందన్ రావు.
కాగా గణతంత్ర దినోత్సవ వేడుకలపై తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రాజ్ భవన్ లో గణతంత్ర వేడుకలకు గవర్నర్ తమిళిసై హాజరయ్యారు. అనంతరం గవర్నర్.. సైనికుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఆ తర్వాత ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనది అన్నారు. మేధావులు, మహోన్నత వ్యక్తులు మన రాజ్యాంగం రూపొందించాన్నారు. రాజ్యాంగ రచనలో అంబేద్కర్ ఎంతో అంకిత భావం కనబరిచారన్నారు. శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఎన్నో రంగాల్లో దూసుకుపోతోందని అన్నారు గవర్నర్ తమిళిసై.