సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో సారి ఫైర్ అయ్యారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వరద నష్టం అంచనా, పరిహారం ప్రకటించడం టీఆర్ఎస్ సర్కార్ కు చేతకాలేదన్నారు. పైగా కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేశారని ఆయన మండిపడ్డారు.
ఫాం హౌజ్ నుంచి సీఎం కేసీఆర్ ను బయటకు గుంజుకు వచ్చిన ఘనత తమ పార్టీకే దక్కుతుందన్నారు. అన్ని పనులు కేంద్రమే చేస్తే రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ సర్కార్ ను రద్దుచేస్తే రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్ అద్భుతమైన పాలనను అందిస్తుందన్నారు.
ఇటీవల కురిసిన వర్షాలకు ఇండ్లు, పంట నష్టపోయిన ప్రజలకు పరిహారం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు అయిందని, ఇప్పటికి ఒక్కరికీ పరిహారాన్ని కేసీఆర్ సర్కార్ ప్రకటించలేదన్నారు. పంట పరిహారానికి సంబంధించి కేంద్రం ఇచ్చిన పరిహారం విషయంలో సీఎం కేసీఆర్ కు హైకోర్టు మొట్టికాయలు వేసిందని తెలిపారు.
కానీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇంకా బుద్ధి రాలేదన్నారు. వరదలు వచ్చిన ప్రతిసారీ వేల కోట్ల పరిహారం ప్రకటించడమే తప్పా… ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. విపత్తు నిర్వహణ శాఖ కింద కేంద్రం ఇస్తున్న నిధులను ఏం చేశారో సీఎం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.