హైదరాబాద్ ఫిలింనగర్ హనుమాన్ ఆలయంపై వివాదం నడుస్తోంది. ఆ గుడిని కూల్చే కుట్ర జరుగుతోందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. హిందువుల మనోభావాలను పట్టించుకోకుండా రెడ్ ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్ ప్రయోజనాలే ముఖ్యంగా… ఆలయ తొలగింపునకు ఎమ్మెల్యే దానం మద్దతు ఇచ్చారని అన్నారు. ఆలయాన్ని సందర్శించిన ఆయన కూల్చివేత జరిగితే ఉద్యమిస్తామని హెచ్చరించారు. అయితే.. ఈ ఇష్యూని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై దానం అనుచరులు దాడికి పాల్పడ్డారు. పోలీసులు కూడా హిందూ సంఘాలు, బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఆలయం దగ్గర భారీగా మోహరించారు.
2007లో అప్పటి వైఎస్ ప్రభుత్వం.. డెక్కన్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఎజెన్సీ ద్వారా ప్రభుత్వ భూములను వేలం వేసింది. బాచుపల్లిలోని 90 ఎకరాల భూమిని ఇందూ ప్రాజెక్ట్ సంస్థ కొనుగోలు చేసింది. ఒక్కో ఎకరం రూ.4 కోట్ల చొప్పున రూ.369 కోట్లను 5 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంది. కానీ.. 200 కోట్లు మాత్రమే ఇచ్చింది. తర్వాత కొందరు ఆ భూములు తమవంటూ కోర్టుకెక్కారు. దీంతో రిజిస్ట్రేషన్స్ జరగలేదు. కొనుగోలు చేసిన సంస్థ ఆలస్యం అయినాసరే తమకు భూమినే కేటాయించాలని ట్రైబ్యునల్ కి వెళ్లింది. ఎట్టకేలకు 2019లో రూ.200 కోట్లకు వడ్డీ కలుపుకొని ఎంత మొత్తం అయిందో ఆ విలువ చేసే భూమిని కేటాయించాలని ట్రైబ్యునల్ ప్రభుత్వాన్ని అదేశించింది. అన్ని లెక్కలు తిరగేస్తే 2021 వరకు రూ.225 కోట్ల రూపాయలు ఇందూ సంస్థకు చెందిన సొమ్ము ప్రభుత్వం దగ్గర ఉందని తేలింది.
భూమి కేటాయించాలంటే అప్పుడు వేలం పాటలో దక్కించుకున్నట్లు.. ఇప్పుడు కూడా వేలం ద్వారా గానీ మార్కెట్ విలువ ప్రకారం గానీ ఇవ్వాలి. కానీ.. ప్రభుత్వ పెద్దలు, ఇతర నాయకులు, అధికారుల లబ్ధితో సీన్ మారింది. ఇందూ ప్రాజెక్ట్ కు చెందిన మరో సంస్థ రెడ్ ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్ కి ఫిలింనగర్ లోని సర్వే నెంబర్ 403లో కొండ ప్రాంతమైన షేక్ పేట నాలా, రామానాయుడు స్టూడియో నుంచి ఓల్డ్ ముంబై హైవేకు ఆనుకునే అత్యంత కాస్ట్లీ ఏరియా 10 ఎకరాలు కేటాయిస్తూ జీవో నెంబర్ 1ని విడుదల చేసింది ప్రభుత్వం. పైగా 2013లో ఉన్న రిజిస్ట్రేషన్ విలువతోనే కేటాయించింది. ఇక్కడ గజం భూమి 2021 మార్కెట్ లెక్కల ప్రకారం రూ.2 లక్షలకు ప్రభుత్వం విక్రయించుకోవచ్చు. అంటే.. ఎకరాకు రూ.100 కోట్లు డిమాండ్ తో కొనుగోలు చేసేవారు కూడా ఉన్నారు. చుట్టూ అత్యంత విలువైన విల్లాలు, అపార్ట్ మెంట్లు రావడంతో డిమాండ్ బాగా పెరిగింది.
మరోవైపు 20 ఏళ్లుగా ఇక్కడి ఆంజనేయుడికి ధూపదీప నైవేద్యాలు అందిస్తూ.. పక్కనే ఉన్న అంబేద్కర్ నగర్, బస్తీ, వినాయక నగర్ వాసులు పూజలు నిర్వహిస్తారు. ఇప్పుడు ఆ గుడికి వెళ్లేందుకు దారి లేకుండా చేశారు. చుట్టూ పెద్ద రేకులతో ప్రహరీ నిర్మించారు. గుడికి 200 గజాల స్థలం ఇస్తాం. మీరెవరూ గొడవ చేయొద్దని రాజీకి వచ్చారు. కానీ.. దారి లేని దేవుడికి స్థలం ఇస్తే.. తాము ఎలా పూజలు చేయాలని స్థానికులు ఆందోళనకు దిగారు. బజరంగ్ దళ్, బీజేపీ కార్యకర్తులు స్థానికులకు మద్దతుగా నిలిచారు. ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా స్పందించి గుడిని కూల్చే కుట్ర జరుగుతోందని అన్నారు. అదేగనక జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.