బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చలో భైంసాకు పిలుపునివ్వడంతో ఆయనను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. భైంసాలో హిందువులపై ఉద్దేశ్యపూర్వకంగానే దాడులు జరుగుతున్నాయని రాజా సింగ్ ఆరోపిస్తూ మంగళవారం చలో భైంసాకు పిలుపునిచ్చారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆయనను బయటకి రాకుండా పోలీసులు రాజా సింగ్ నివాసం వద్ద భారీగా మోహరించారు.
ఆదివారం రాత్రి భైంసాలో మతపరమైన ఘర్షణలు తెలెత్తిన సంగతి తెలిసిందే. రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో అది తారాస్థాయికి చేరుకుంది. అక్కడ ఉన్న పోలీసు ఉన్నతాధికారులతోపాటు పలువురు ఆందోళనకారులకు గాయాలయ్యాయి. దీంతో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా పోలీసులు 144సెక్షన్ విధించడంతో పాటు అదిలాబాద్ వ్యాప్తంగా ఇంటర్ నెట్ సేవలను నిలిపేస్తూ నిర్ణయం తీసుకున్నారు.