బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీ ఎన్నికలపై మాట్లాడిన ఆయన ఓటర్లకు వార్నింగ్ ఇచ్చారు. యూపీలో ఉండాలనుకునే వాళ్లు సీఎం యోగీకి ఓటు వేయాల్సిందేనన్నారు.
‘ యూపీలో త్వరలో మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అందరూ సీఎం యోగీకే ఓట్లు వేయాలి. యోగీకి ఓటు వేయని వాళ్ల వివరాలతో ఓ జాబితా తయారు చేస్తాము. అలాంటి వారి ఇండ్లపైకి బుల్డోజర్లు పంపిస్తాము. దీని కోసం ఇప్పటికే యోగీ పెద్ద సంఖ్యలో బుల్డోజర్లు, జేసీబీలను రాష్ట్రానికి తెప్పించారు” అని అన్నారు.
రాష్ట్రంలో త్వరలో మూడోదశ ఎన్నికలు జరగనున్నాయి. గత రెండు దశల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అత్యధికంగా ఓటింగ్ నమోందైంది. యోగీ విజయం కోసం బీజేపీ శ్రేణులు, హిందువులందరూ పెద్ద ఎత్తున తరలి రావాలి. రాష్ట్రంలో మరోసారి యోగీకి పట్టం కట్టాలని కోరారు.
ఇప్పటికే యూపీలో యోగీసర్కార్ పై ప్రజలు పెదవి విరుస్తున్నారని పలు సర్వేలు పేర్కొంటున్నాయి. ఇలాంటి తరుణంలో ఎమ్మెల్యే రాజాసింగ్ తన వ్యాఖ్యలతో పార్టీకి కొత్త తల నొప్పులు తీసుకువచ్చారని రాజకీయ పండితులు అంటున్నారు.