– బాలిక కేసును నీరుగార్చేందుకు సీఎంఓ కుట్ర
– పోలీసుల విచారణపై నమ్మకం పోయింది
– సీబీఐ విచారణ జరిపించాల్సిందే..
– టీఆర్ఎస్, మజ్లిస్ నేతల బరితెగింపునకు అడ్డూఅదుపు లేదా?
– రాజాసింగ్ ఫైర్
మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా ప్రభుత్వ వాహనంలోనే ఈ అఘాయిత్యానికి పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. కేసీఆర్ పాలనలో టీఆర్ఎస్, మజ్లిస్ నాయకులు ఏం చేసినా చెల్లుతుందనే భావనతో బరితెగిస్తున్నారని మండిపడ్డారు. అడ్డూఅదుపు లేకుండా హత్యలు, అత్యాచారాలు చేయడానికి అధికారిక వాహనాలను, కార్యాలయాలను అడ్డాగా చేసుకుంటున్నారని విమర్శించారు.
గత నెల 28న అత్యాచారం చేస్తే.. కేసులో టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యే, ఛైర్మన్, ప్రముఖుల కుమారులున్నట్లు సీసీటీవీ పుటేజీలు, వీడియోల్లో స్పష్టంగా కన్పిస్తున్నాపూర్తి స్థాయిలో విచారణ చేయకపోవడం ఏంటని ఫైరయ్యారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మజ్లిస్ ఎమ్మెల్యే కుమారుడిని అరెస్ట్ చేయకుండా అతను విదేశాలకు పారిపోయేదాకా మీనమేషాలు లెక్కించడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో అధికార టీఆర్ఎస్, మజ్లిస్ నేతల ప్రమేయం ఉన్నట్లు స్పష్టంగా కన్పిస్తోందని ఆరోపించారు రాజాసింగ్. హోంమంత్రి మనవడు నిందితులందరికీ పబ్ లో పార్టీ ఇచ్చినట్లు తేలిందని… నిందితులందరినీ తప్పించేందుకు కేసును నీరుగారుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండే ఈ కుట్ర జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయని తెలిపారు.
ఇలాంటి తరుణంలో రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలో విచారణ సజావుగా సాగుతుందనే నమ్మకం పోయిందన్నారు రాజాసింగ్. బీజేపీ పోరాడేదాకా, మీడియాలో వార్తలు వచ్చేదాకా పోలీసులు కనీసం ఈ కేసుపై స్పందించనే లేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే… దోషులను శిక్షించేందుకు సీబీఐ విచారణ జరిపించి నిజాయితీని నిరూపించుకోవాలని సవాల్ చేశారు.