సస్పెన్షన్ పై పోరాటానికి సిద్ధమయ్యారు బీజేపీ ఎమ్మెల్యేలు. ఈనెల 17న ఇందిరాపార్క్ దగ్గర నిరసన దీక్ష చేస్తామని ప్రకటించారు. తమను అప్రజాస్వామికంగా సభ నుంచి సస్పెండ్ చేశారని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యేలు రాజేందర్, రఘునందన్, రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు.
స్పీకర్ తన గౌరవాన్ని నిలబెట్టుకోలేదన్నారు ఈటల రాజేందర్. ఇది నియంతృత్వానికి దారి తీస్తుందని మండిపడ్డారు. తమ ప్రతిపాదనగా సభ అభిప్రాయం కొరమని ఆడిగామని అయినా పట్టించుకోలేదని ఆగ్రహించారు. ఇదంతా చూస్తుంటే ఉత్తర కొరియా గుర్తుకొస్తోందని సెటైర్లు వేశారు. అక్కడ చప్పట్లు కొట్టలేదని కాల్చి చంపారని.. ఇక్కడ అసెంబ్లీలో చప్పట్లు కొట్టలేదని సస్పెండ్ చేసే రోజు వస్తుందేమో అంటూ చురకలంటించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించండి.. నియంతృత్వాన్ని బొంద పెట్టండి అనే నినాదంతో 17న ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేస్తామని స్పష్టం చేశారు ఈటల రాజేందర్.
దేశ శాసన వ్యవస్థలో ఇవాళ బ్లాక్ డే అని రఘునందన్ అన్నారు. బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకుండా తమను సస్పెండ్ చేయడంపై హైకోర్టును ఆశ్రయించగా.. ధర్మాసనం తమను స్పీకర్ ను కలవాల్సిందిగా సూచించిందని చెప్పారు. అయితే కోర్టు తీర్పు కాపీని చూసిన స్పీకర్ తన నిర్ణయంలో మార్పు లేదని స్పష్టం చేశారని అన్నారు. తమ అభ్యర్థనను ఒక్క నిమిషంలోనే తిరస్కరించారని చెప్పారు. స్పీకర్ కు రాజకీయాలు ఆపాదించడం తమకు ఇష్టం లేదని.. కానీ ఉద్దేశపూర్వకంగానే ఆయన తమపై సస్పెన్షన్ ఎత్తేయలేదని విమర్శించారు.
స్పీకర్ లో భయం కనిపించిందని అన్నారు రాజాసింగ్. కేసీఆర్ ఆయన్ను టార్చర్ పెడుతున్నారని ఆరోపించారు. తాను తప్పు చేస్తే.. ఈటల, రఘునందన్ ను ఎందుకు సస్పెండ్ చేశారని అడిగితే సమాధానం లేదని మండిపడ్డారు. సభలో బీజేపీ వాయిస్ లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ప్లాన్ ప్రకారమే తమను సస్పెండ్ చేశారని అన్నారు రాజాసింగ్.
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మొదలైన తొలి రోజునే సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్, రాజేందర్ ను సస్పెండ్ చేశారు స్పీకర్. తమను సభలోకి అనుమతించేలా స్పీకర్ కు సూచించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్యేలు. దీనిపై ధర్మాసనం స్పీకర్ ను కలిసి తమ వాదనలను వినిపించాల్సిందిగా తీర్పునిచ్చింది. దీంతో తీర్పు కాపీతో బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు. అయితే.. వారి అభ్యర్థనను స్పీకర్ తిరస్కరించారు.