ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. అసలు విచారణలో ఈడీ అధికారులకు కవిత సహకరించలేదని సమాచారం వచ్చిందన్నారు. లిక్కర్ కుంభకోణం కేసనులో కవిత వ్యవహారం అత్యంత కీలకం కానుందని అన్నారు.
ఎందుకు, ఏమిటి, ఎలా అని ఈడీ ప్రశ్నిస్తే.. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అని కవిత సమాధానం చెప్పిందని ఎద్దేవా చేశారు. విచారణకు సరిగా సహకరించకపోతే త్వరగా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని అరవింద్ స్పష్టం చేశారు. చేయాల్సిన సమయంలో నిర్భయంగా తప్పు చేసి.. ఇప్పుడు కవిత టెన్షన్ పడుతుందని దుయ్యబట్టారు.
కవిత విచారణ నేపథ్యంలో శనివారం తెలంగాణ ప్రభుత్వం మొత్తం ఢిల్లీకి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ చిత్తశుద్ధి తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ మహిళల పట్ల ఉంటే బాగుండు అని సెటైర్లు వేశారు అరవింద్. ప్రభుత్వాన్ని రద్దు చేసి కేసీఆర్ ఎన్నికలకు వెళ్లాలని సూచించారు.
కవితపై బండి సంజయ్ వ్యాఖ్యల్ని సమర్థించనన్నారు ఎంపీ అరవింద్. సామెతలను జాగ్రత్తగా వినియోగించాలని సంజయ్ కు సూచించారు. బండి సంజయ్ వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదన్నారు. బండి తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటే బాగుంటుందని తెలిపారు ఎంపీ అరవింద్.