గ్రేటర్ ఫైట్‌లో తమ ప్రత్యర్థి టీఆర్ఎస్ కానే కాదని.. ఎంఐఎంతోనే తమ పోటీ అంటూ మొదట్లోనే ప్రకటించింది బీజేపీ. నాడు వ్యూహాత్మకంగా ఆ మాట చెప్పినా.. పరిణామాలు మాత్రం దానికి తగ్గట్టే జరుగుతున్నాయి. టీఆర్ఎస్ కంటే ఎంఐఎంనే ఎక్కువగా టార్గెట్ చేస్తోంది బీజేపీ. గ్రేటర్ పీఠాన్ని దక్కించుకున్నాక.. రోహింగ్యాల ఏరివేత కోసం పాతబస్తీపై సర్జికల్ స్ట్రక్స్ చేస్తామంటూ ఆ పార్టీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపగా.. తాజాగా ఎంఐఎంకు కౌంటర్‌గా మళ్లీ అలాంటి కామెంట్లే చేశారాయన.
నగరంలో అక్రమ కట్టడాలను కూల్చాల్సి వస్తే.. ముందుగా హుస్సేన్‌సాగర్ చుట్టూ ఉన్న పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చాలంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చేసిన వ్యాఖ్యలకు.. బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చే దమ్ము నీకుందా అంటూ ప్రశ్నించారు. అదే జరిగితే అవి కూల్చిన రెండుగంటల్లో నీ దారుస్సలాంను బీజేపీ కార్యకర్తలు కూల్చేస్తారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం నాయకులు చేసే సవాల్‌ను స్వీకరించలేని దౌర్భాగ్య పరిస్థితిలో టీఆర్ఎస్ నేతలు ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.