బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. తమ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు తగ్గేదేలే అంటూ విద్యార్థులు తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గానీ, మంత్రి కేటీఆర్ గానీ వచ్చే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఎండనక, వాననక మూడ్రోజులుగా విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు.
ఇటు కాస్త దిగొచ్చిన సర్కార్.. బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ గా ఓయూ సతీశ్ కుమార్ ను నియమించింది. ఆయన విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చింది. అయినా వెనక్కి తగ్గిన విద్యార్థులు డైరెక్టర్ నియామకంతో తమ సమస్యలు పరిష్కారం కావని తెగేసి చెప్పారు. కేసీఆర్ తమ వద్దకు వస్తే తప్ప ఆందోళన విరమించమని భీష్మించుకు కూర్చున్నారు.
మరోవైపు.. ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేసీఆర్ పాలనలో విద్యావ్యవస్థ నాశనం అయ్యేలా ఉందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల డిమాండ్లను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు. పైగా తమ సమస్యల గురించి చెప్తే.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సిల్లీగా ఉన్నాయనడం అహంకారంగా అనిపిస్తోందని మండిపడ్డారు. దీన్నిబట్టే విద్యావ్యవస్థపై అమెకున్న చిత్తశుద్ది ఏంటో అర్థం అవుతోందన్నారు.
సబిత భర్త ఇంద్రారెడ్డి కమిట్ మెంట్ తో రాజకీయాలు చేసిన వ్యక్తి అని.. కానీ, సబిత దొరల పార్టీలో చేరి ఓ బానిసగా మారారని ఆరోపించారు అరవింద్. ఎన్నో రాష్ట్రాలు తిరుగుతున్న కేసీఆర్ కు వందల మంది విద్యార్ధులు ఆందోళన చేస్తుంటే వారిని ఒక్కసారి కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. వాళ్లు తెలంగాణలో లేరా అని నిలదీశారు.