లిక్కర్ స్కాంపై ఈడీ, సీబీఐ దూకుడుతో పొలిటికల్ గా పంచ్ లు పేలుతున్నాయి. బీజేపీ ఎంపీ అరవింద్.. ఎమ్మెల్యే కవితను టార్గెట్ చేస్తూ మండిపడ్డారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ లో రైతు నాయకుడు తిరుపతి రెడ్డిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా కేసీఆర్, కవితపై ఫైరయ్యారు.
అభిషేక్ రావు, రామచంద్ర పిళ్లై కవిత బినామీలు అని ఆరోపించారు అరవింద్. ఢిల్లీ లిక్కర్ పాలసీని వీరే రూపొందించారని అన్నారు. ఢిల్లీలో ప్రభుత్వ లిక్కర్ డీలర్ షిప్ ను ప్రైవేట్ పరం చేశారని తెలిపారు. 2 శాతం ఉన్న లిక్కర్ పాలసీని 12 శాతానికి పెంచి కుంభకోణం చేసింది కవిత కాదా అని ప్రశ్నించారు. దీని ద్వారా అక్కడి ప్రజల సొమ్మును దోచేశారని విమర్శలు గుప్పించారు అరవింద్.
ఇక వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ నేతలకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మునుగోడులో విజయం సాధించి.. టీఆర్ఎస్ ను భూ స్థాపితం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పెట్టినా లేక మరో అంతరిక్ష పార్టీ పెట్టినా ఆయన తనకు లిల్లీపుట్ తో సమానమని విమర్శించారు అరవింద్.