టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ కే.లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. టీఎస్పీఎస్పీ మంత్రి కేటీఆర్ కనుసన్నల్లో నడుస్తోందని ఆయన అన్నారు. లీకేజ్ ఘటనకు కేటీఆర్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కేసు విచారణను సిట్‌కు అప్పగించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీ వెనుక పెద్ద తలకాయలు వున్నాయని, వాటి బండారం బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నయీం కేసులో దర్యాప్తును సిట్ ఇంతవరకు తేల్చలేదన్నారు.
కీలక కేసుల్లో కేవలం హడావుడి చేయటం మాత్రమే తప్ప విచారణ పూర్తి చేయలేదన్నారు. ఎనిమిదేండ్లైనా ఓటుకు నోటు కేసు ఇప్పటికీ తేలలేదని మండిపడ్డారు. అవినీతి కేసుల మూసివేతలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. పోలీసు, నిఘా వ్యవస్థను రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారంటూ ఆయన ఫైర్ అయ్యారు.
గ్రూప్-1 పరీక్షపై కూడా చాలా అనుమానాలు వస్తున్నాయన్నారు. పరీక్షా ప్రశ్నా పత్రాల లీకేజ్ ఈ ప్రభుత్వానికి కొత్త కాదని ఆయన ధ్వజమెత్తారు. ఇంత పెద్ద స్కామ్‌లో కేవలం ఇద్దరు చిన్న ఉద్యోగులను అరెస్టు చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. పరీక్షలను ఆలస్యం చేసి యువతను మళ్లీ మభ్య పెట్టే కుట్ర జరుగుతోందన్నారు.