సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే మునుగోడు ఎన్నికల్లో గెలిచి చూపించాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సవాల్ విసిరారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రజలు తగిన బుద్ది చెబుతారని ఆయన అన్నారు. రాజేంద్ర సర్కిల్ మహవీర్ కాలేజీలో తెలంగాణ బీజేపీ ఓబీసీ మోర్చా మూడు రోజుల శిక్షిణా శిబిరం, రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు మాజీ ఎంపీ మురళీధర్ రావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ… ఉద్యమకారులను టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో బీసీలకు సముచిత స్థానం లభించలేదన్నారు.
టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలను మోసం చేశాయని ఆయన మండిపడ్డారు. బీసీలకు ప్రధాని మోడీ సముచిత స్థానం ఇచ్చారని, వారికి ఉన్నత పదవులతోపాటు రిజర్వేషన్లు కల్పించారని పేర్కొన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ కుటుంబ అప్పుల తెలంగాణగా మర్చారని ఫైర్ అయ్యారు.
సీఎం కేసీఆర్ పాలనపై ప్రజల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ అఖండ మెజారిటీతో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఓబీసీ నేతలకు ఆయన సూచించారు.