సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ, ప్రముఖ నటుడు రవికిషన్. ప్రభుత్వం ఎంఐఎంకు భయపడి నిర్వహించడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని.. బండి సంజయ్ ని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. ప్రజా సంగ్రామయాత్రలో పాల్గొన్న రవికిషన్ కోహెడలో ప్రసంగించారు.
హిందుత్వ టైగర్ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు విశేష స్పందన వస్తోందన్నారు రవికిషన్. బీజేపీ హిందూ ధర్మం కోసం పోరాడుతున్న పార్టీ అని చెప్పారు. భారత్ ను విశ్వగురు స్థానంలో నిలబెట్టడానికి నరేంద్ర మోడీ ఎంతో కృషి చేస్తున్నారని వివరించారు. తెలంగాణ, ఏపీలో ప్రతీ ఒక్కరూ బీజేపీకి మద్దతివ్వాలన్నారు.
ఒకే ఒక్కసారి రాష్ట్రంలో బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు రవికిషన్. తమ పార్టీకి 18 కోట్ల మంది కార్యకర్తలున్నారని గుర్తుచేశారు. బీజేపీలో ఏదైనా సాధ్యమేనన్నారు. ఎందుకంటే తమది కుటుంబ పార్టీ కాదని.. కార్యకర్తలు నడిపే పార్టీ అని చెప్పుకొచ్చారు.