”మేకిన్ ఇండియా రేపిన్ ఇండియా” గా మారిందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్ లో దుమారం లేపాయి. రాహుల్ వ్యాఖ్యలను తప్పు బడుతూ మంత్రి స్మృతీ ఇరానీతో సహా బీజేపీ మహిళా మంత్రులు ఆయనపై విరుచుకుపడ్డారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై షేమ్..షేమ్ అంటూ అధికార పక్ష సభ్యులు పలుమార్లు నిరసన వ్యక్తం చేయడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. చరిత్రలో మొదటిసారిగా మహిళలను రేప్ చేయమంటూ రాహుల్ గాంధీ పిలుపునిచ్చారని..ఇదేనా దేశ ప్రజలకిచ్చే సందేశం అంటూ ప్రశ్నించారు. ఇలాంటి పిలుపునిచ్చిన రాహుల్ గాంధీని శిక్షించాలని డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వడానికి ప్రయత్నించిన రాహుల్ గాంధీకి స్పీకర్ అనుమతించ లేదు. దీంతో రాహుల్ గాంధీ సభ బయట మీడియాతో మాట్లాడారు. తాను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని…తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
ప్రధాన మంత్రి ఎప్పుడూ మేకిన్ ఇండియా గురించే మాట్లాడుతుంటారు. కానీ ప్రతిరోజు పేపర్ చూస్తే మహిళలపై రేప్ కేసులే కనపడుతున్నాయి. దీంతో మేకిన్ ఇండియా రేపిన్ ఇండియా మారుతుందన్నానని..దీనిలో తప్పేముందని ప్రశ్నించారు. పౌరసత్వం (సవరణ) బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో పెల్లుబికుతున్న నిరసనలపై ప్రజల దృష్టిని మరల్చడానికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ఈ విషయంపై సభలో రాద్ధాంతం చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.