ఎన్డీఏ కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరు ఖరారైంది. ఆమెను తమ అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల కోసం మొత్తం 20 మంది పేర్లను బీజేపీ పార్టీ పరిశీలించింది. వారిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేరు ప్రముఖంగా వినిపించింది.
ఈ క్రమంలో రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు నేడు సమావేశం అయింది. బీజేపీ నేతలతో పాటు, బీజేపీ మిత్రపక్షాలు రాష్ట్రపతి అభ్యర్థిపై సుదీర్ఘంగా ఆలోచనలు చేశాయి. చివరకు ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నట్టు బీజేపీ నేతలు ప్రకటించారు.
ఆమె గతంలో జార్ఖండ్ గవర్నర్ గా పనిచేశారు. ఈ ఎన్నికల్లో ఆమె గెలిస్తే రాష్ట్రపతి పదవి చేపట్టిన తొలి ఆదివాసి వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు. అంతేకాకుండా రాష్ట్రపతి పదవి చేపట్టిన రెండో మహిళగా ఆమె రికార్డు సృష్టించనున్నారు. అంతకు ముందు ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా పని చేశారు.
రాష్ట్రపతి అభ్యర్థి రేసులో వెంకయ్యనాయుడు పేరు ప్రముఖంగా వినిపించింది. ఈ క్రమంలో వెంకయ్యనాయుడితో కేంద్ర హోం మంత్రి అమిత్ షా. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ అయ్యారు.
రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైనట్టేనని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. మరోవైపు విపక్షాలు తమ రాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హాను బరిలోకి దించుతున్నాయి.