ఈ ఏడాది 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణతో పాటు కర్నాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఉండనుంది. ముందుగా ఫిబ్రవరి, మార్చిలో ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత మేలో కర్నాటక, నవంబర్ లో మిజోరం, ఆ తర్వాత రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనున్నారు.
2024 మేలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అంతకంటే ముందు ఈ ఏడాది జరగనున్న 9 రాష్ట్రాల ఎన్నికలను సెమీ ఫైనల్స్ గా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కీలక సమావేశాలను నిర్వహిస్తోంది. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆధ్వర్యంలో పదాధికారుల సమావేశం ఏర్పాటు చేశారు. రెండు రోజులపాటు ఇది కొనసాగనుంది. ఈ సమావేశంలో జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలను ఖరారు చేయనున్నారు.
రాజకీయ, ఆర్ధిక అంశాలపై కార్యవర్గం తీర్మానాలు చేయనుంది. సమావేశాల్లో భాగంగా సాయంత్రం ఢిల్లీలో కిలోమీటర్ పొడవున రోడ్ షో జరుగనుంది. ఇందులో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. రోడ్ షో సందర్భంగా రోడ్డు పొడవునా వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వచ్చేనెలాఖరుతో జేపీ నడ్డా పదవీకాలం ముగియనుంది. ఈ సమావేశాల్లో నడ్డా పదవీకాలం పొడిగించే అవకాశం ఉంది.
మరోవైపు.. తెలంగాణ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, డీకే అరుణ ఇతక ముఖ్య నేతలు సమావేశాలకు హాజరవుతున్నారు. ఇందులో బండి సంజయ్ పాదయాత్రపై ఏవీ ప్రదర్శన ఉండే అవకాశం ఉంది. ప్రజా సంగ్రామయాత్ర తరహాలో ఇతర రాష్ట్రాలలో పాదయాత్రలకు బీజేపీ అధిష్టానం ప్లాన్ చేస్తోంది. సంజయ్ పాదయాత్ర జరిగిన తీరు.. ఏర్పాట్లపై రాష్ట్ర నేతలు ప్రజెంటేషన్ ఇస్తారని అంటున్నారు.