బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడిగించారు. ఈ మేరకు జాతీయ కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. ఆయన పదవీ కాలాన్ని 2024 వరకు పొడిగించాలని జాతీయ కార్యవర్గం నిర్ణయించినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు.
జూన్ 2024 వరకు ఆయన పదవిలో కొనసాగుతారని అమిత్ షా తెలిపారు. ఆయన పదవీ కాలాన్ని పొడిగించేలా పార్టీ జాతీయ కార్యవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసిందన్నారు. వచ్చే ఏడాది మేలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో నడ్డా పదవీ కాలాన్ని పొడిగించేందుకు ప్రాధాన్యతనిచ్చినట్టు చెప్పారు.
2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అద్భుతమైన విజయం సాధించదన్నారు. మోడీ, జేపీ నడ్డా నాయకత్వంలో 2024 లోక్ సభ ఎన్నికల్లోనూ ఘన విజయాన్ని సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లోనూ మోడీనే ప్రధాని అవుతారని అమిత్ షా అభిప్రాయం వ్యక్తం చేశారు.
పార్టీకి నడ్డా అధ్బుతమైన సేవలందించారని ఆయన కొనియాడారు. ప్రధానంగా కరోనా సమయంలో పార్టీని సమన్వయం చేస్తూ, ప్రజలకు సేవ చేశారని నడ్డాను ఆయన అభినందించారు. నడ్డా నాయకత్వంలోనే పలు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు.