– తెలంగాణలో క్షీణించిన శాంతి భద్రతలు
– అన్నింటా సీఎం ఫెయిల్
– రక్షుకులే భక్షుకులయ్యారు..
– ప్రభుత్వంపై తరుణ్ చుగ్ ఫైర్
తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్ మండిపడ్డారు. నాంపల్లి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అత్యాచారాలు, హత్యలు నిరోధించడంలో.. శాంతి భద్రతలను కాపాడటంలో.. పరిపాలనా నిర్వహణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ బాలికపై అత్యాచారం కేసులో దోషులను తప్పించేందుకు కుట్ర చేశారన్నారు. దోషులకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో రక్షకులే భక్షకులుగా మారారన్నారు.
తక్షణమే బాలిక అత్యాచారం కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు తరుణ్ చుగ్. తెలంగాణ లో జంగల్ రాజ్ నడుస్తోందని.. న్యాయ వ్యవస్థకు స్థానం లేకుండా చేశారని ఆరోపించారు. తెలంగాణ బిడ్డలు సురక్షితంగా లేరన్న ఆయన.. శాంతి భద్రతలు పూర్తిగా క్షిణించాయని అన్నారు. తెలంగాణ ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని.. ముఖ్యమంత్రి ఇంత జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ అసమర్థ ప్రభుత్వమని విమర్శలు గుప్పించారు.
‘‘కేసీఆర్ పూర్తిగా కుటుంబ రాజకీయాల్లో మునిగి పోయారు. ప్రభుత్వం లో చలనం లేదు. తెలంగాణలో చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే భక్షకులుగా మారి పోయారు. కేసీఆర్ ఆఫీస్ కి వెళ్ళకుండా ఫాంహౌజ్ కే పరిమితమైండు. కేటీఆర్ ట్విట్టర్ లో బీజీగా ఉన్నాడు. ఇగ హోం మినిస్టర్ ఉన్నాడా లేడా? అనేది ఎవరికీ తెలియని దుస్థితి’’ అని మండిపడ్డారు తరుణ్ చుగ్.
కేసీఆర్ తన పర్సనాలిటీని దేశవ్యాప్తంగా బిల్డప్ చేసుకోవడానికి సర్కారు ఖజానా నుండి రూ.109 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. దేశంలోని అన్ని పత్రికలకు ప్రకటనలిచ్చి పేద ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అత్యాచారం కేసును సీబీఐకి అప్పగిస్తేనే అసలు నిందితులకు శిక్ష పడుతుందని చెప్పారు.