బీజేపీ అధిష్టానం తెలంగాణపై ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రతో కార్యకర్తల్లో కొత్త ఊపు రాగా.. లక్ష్మణ్ ను రాజ్యసభకు పంపి అదే ఉత్సాహాన్ని కొనసాగించాలని చూస్తోంది. దీనికి తోడు జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ ను వేదికగా చేసుకుంటోంది. దీన్ని బట్టి తెలంగాణపై బీజేపీ పెద్దలు గట్టిగానే ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తోంది.
అయితే.. నగరంలోని హెచ్‌ఐసీసీలోని నోవాటెల్ హోటల్ లో సమావేశాలు నిర్వహించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించేందుకు ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి బీఎల్ సంతోష్ హైదరాబాద్ కు చేరుకున్నారు.
పార్టీ అగ్రనేతలతో పాటు.. సుమారు 300 మంది ప్రముఖులు ఉండేలా నోవాటెల్ హోటల్ వద్ద బస ఏర్పాట్లను చేస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణకు తెలంగాణను వ్యూహాత్మకంగానే ఎంపిక చేసినట్లు రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు మాదాపూర్ లోని హెచ్‌ఐసీసీని సందర్శించి పరిశీలించారు. ఈ సమావేశాల నిర్వహణ కోసం హైటెక్స్ లోని హెచ్‌ఐసీసీతోపాటు.. మరికొన్ని హోటళ్లు, రిసార్ట్ లను కూడా పరిశీలించారు. హైదరాబాద్ లో ఈ సమావేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఈ నెల 23 నుండి ప్రరంభం కానున్న బండి సంజయ్ 3వ విడత పాదయాత్ర వాయిదా పడినట్లే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్రమంత్రులు, జాతీయస్థాయి ముఖ్యనేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. రెండు రోజుల పాటు మోడీ, అమిత్ షా తదితరులు ఇక్కడే ఉంటారు. ప్రధాని రాజ్ భవన్ లో బస చేయనున్నారు.