తమ పిల్లలు గూండాలు, రేపిస్టులుగా మారాలని కోరుకునే వారు తమ పిల్లలను బీజేపీలోపి పంపాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలు-2024 ప్రచార కార్యక్రమాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలను ఆప్ అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దినట్టు ఆయన తెలిపారు. ఢిల్లీలో ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులతో పోటీపడుతున్నట్టు చెప్పారు.
ఈ సంవత్సరం 4 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ ను విడిచిపెట్టి ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని ఆయన అన్నారు. 400 మంది ఢిల్లీ ప్రభుత్వ విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సుల పోటీ పరీక్షల్లో విజయం సాధించి ప్రసిద్ధ కళాశాలల్లో అడ్మిషన్లు పొందారని చెప్పారు.
‘నేను సాధారణ వ్యక్తిని. నాకు రాజకీయాలు తెలియదు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలను నేను మెరుగుపరిచాను. పాఠశాలలు ఈసారి 99.7 శాతం ఫలితాలు సాధించాయి. మెలానియా ట్రంప్ (అమెరికా మాజీ ప్రథమ మహిళ) ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించడానికి వచ్చారు. (మనోహర్ లాల్) ఖట్టర్ ప్రభుత్వ పాఠశాలను చూడటానికి ఎవరు వస్తారు’అని అన్నారు.
తమ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు కావాలనుకునే వారు మాతో రండి. అల్లరిమూకలు, గూండాలు, రేపిస్టులుగా మారాలని కోరుకునే వారు బీజేపీతో వెళ్లండి. ఇలాంటి అంశాలన్నీ ఆ పార్టీలో ఉన్నాయని పేర్కొన్నారు.