నాగార్జున సాగర్ బైపోల్‌పై తెలంగాణ బీజేపీ తీవ్ర కసరత్తే చేస్తోంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు గాలివాటం కాదని నిరూపించుకునేందుకు.. అధికార పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని చాటుకునేందుకు అసలైన అవకాశం ఇదేనని భావిస్తోంది. అయితే సాగర్ మొదటి నుంచి కాంగ్రెస్‌కు కంచుకోట కావడం, టీఆర్ఎస్‌కు మంచి బలం ఉండటంతో.. వాటిని ఎదుర్కోవడం కోసం తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. సాగర్‌లో పోటీ చేసి గెలవడం బీజేపీకి పెద్ద సవాలే అయినప్పటికీ.. పార్టీ తరపున బరిలోకి దిగేందుకు చాలా మంది నేతలే ముందుకు రావడం ఉత్సాహాన్నిస్తోంది.
గత అంసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా కంకణాల నివేదిత పోటీ చేశారు. అయితే పోలైన ఓట్లలో ఆమెకు అత్యల్పంగా 1.48 శాతం (2.675) ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ మారిన రాజకీయ పరిస్థితుల్లో ఓటింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర నాయకత్వం అంచనా వేస్తోంది. దీంతో టికెట్ కోసం పోటీ క్రమంగా పెరుగుతోంది. కంకణాల నివేదితతో పాటు కొంతకాలం క్రితం పార్టీలో చేరిన కడారి అంజయ్య యాదవ్ కూడా అవకాశం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిద్దరూ ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం కూడా మొదలుపెట్టారు. అంజయ్య సాగర్ స్థానానికి లోకల్ కాకపోయినా.. ఆయన సామాజికవర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉండడంతో.. టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ దూకుడు మీద ఉండటంతో.. ఎన్నికల నాటికి టికెట్ రేసులో మరికొందరు వచ్చి చేరే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.