అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీం వల్ల బిహార్ రాష్ట్రం అగ్నికీలల్లో చిక్కుకున్నట్లు అనిపిస్తోంది. శుక్రవారం రెండోరోజూ హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. మధేపురాలో మరో బీజేపీ కార్యాలయానికి నిరసనకారులు నిప్పంటించారు. నవాడాలో గురువారం కాషాయ పార్టీ కార్యాలయాన్ని దగ్ధం చేసిన సంగతి తెలిసిందే.
ఆర్మీలో ఉద్యోగావకాశాలు కోరుకునే వారి భవిష్యత్ కు భరోసా కల్పిస్తామని, అగ్నిపథ్ స్కీంకు ప్రవేశ వయసును 21 నుంచి 23 ఏళ్లకు పెంచుతామని ప్రభుత్వం చెప్పినప్పటికీ యూపీ, బిహార్ సహా పలు రాష్ట్రాల్లో హింసాత్మక నిరసనలు హోరెత్తాయి.
నాలుగేళ్ల సర్వీసు తర్వాత అగ్నివీరుల్లో 25 శాతం మందిని మాత్రమే ఉంచుతారని మిగిలిన వారికి ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా సాగనంపుతారని అభ్యర్థులు ప్రధానంగా నమ్ముతున్నారు. అటువంటిది ఏమి లేదని ప్రభుత్వం తెలియజేస్తున్నప్పటికీ ఆందోళనకారులు మాత్రం తమ నిరసనలు ఆపడం లేదు.
నాలుగేళ్ల తరువాత తమ పరిస్థితి ఏంటని వారు భవిష్యత్ పై రగిలిపోతున్నారు. బిహార్ లో విద్యార్థులు రాళ్ల దాడికి పాల్పడటంతో పాటు వాహనాలకు నిప్పంటించి రైళ్లను దగ్ధం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.