దుబ్బాక ఉప ఎన్నికల గెలుపుతో ఊపు మీదున్న బీజేపీ దూకుడు పెంచింది. ఓవైపు గ్రేటర్ ఎన్నికలను సవాలుగా తీసుకుంటూనే మరోవైపు ఇతర పార్టీల్లో అసంతృప్తిగా నేతలతోనూ టచ్ లోకి వెళ్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు సర్వే సత్యనారాయణను పార్టీలోకి ఆహ్వనించగా, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితోనూ మంతనాలు జరిపారు.
తాజాగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి, ఉద్యోగ సంఘాలను ఒక్కతాటిపై ఉద్యమంలో నడిపిన నేతగా పేరున్న మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ ను బీజేపీలోకి ఆహ్వానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, లక్ష్మణ్ లు స్వామిగౌడ్ తో భేటీ అయ్యారు. కొంతకాలంగా టీఆర్ఎస్ నాయకత్వంపై స్వామిగౌడ్ అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో…. కీలకమైన గ్రేటర్ ఎన్నికల సమయంలో స్వామిగౌడ్ బీజేపీ వైపు మొగ్గుచూపితే రాజకీయాలు మారే అవకాశం ఉన్నట్లు బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఓవైపు ఉద్యమ నేత విజయశాంతి, స్వామిగౌడ్, మాజీ ఎంపి కొండా వంటి నేతలు బీజేపీలో చేరితే రాజకీయ ముఖచిత్రం మారే అవకాశం ఉంటుందని, ఈ ఊపులో గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటితే ఈ జోష్ మరింత పెరుగుతుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.