ఏపీలో టీడీపీని ఖాళీ చేసి పనిలో బీజేపీ ఉందా…? కీలకమైన నాయకులకు బీజేపీ గాలం వేస్తోందా…? పెద్ద నేతల చేరికతో బలపడేందుకు స్కేచ్ వేసిందా…? అందుకే చేరికలను ప్రోత్సహిస్తుందా…?
టీడీపీని అధికార వైసీపీ ఖాళీ చేస్తుందని అంతా భావించారు. గతంలో వైసీపీ నాయకులను పార్టీలోకి తీసుకొని, జగన్‌ను ఇబ్బందులకు గురిచేస్తే… ప్రతీకారం తీర్చుకుంటారు జగన్ అని అంతా అనుకున్నారు. కానీ, జగన్ చేయాల్సిన పని బీజేపీ చక్కబెడుతోంది. టీడీపీని టార్గెట్‌గా చేసి… బీజేపీ దూకుడుగా వెళ్తోంది.
ఓవైపు అధికార వైసీపీపై విమర్శలు చేస్తూనే… మరోవైపు టీడీపీని ఖాళీ చేసే పనిలో బీజీగా ఉంది బీజేపి. కేంద్ర నాయకత్వం సూచనలతో రాష్ట్ర నాయకత్వం మరింత స్పీడ్‌గా పనిచేస్తున్నట్లు కనపడుతోంది. పక్కా ప్రణాళికతో భవిష్యత్‌లో పనికొస్తారనే నేతలనే ఎంపిక చేసుకుంటూ బీజేపీ కండువా కప్పేస్తున్నారు.
తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని బీజేపీలోకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధమయింది. వంశీ కూడా తన అనుచరులతో ఇప్పటికే సమావేశం అయ్యారని, తనకు అన్ని విధాలా అండగా ఉండే సుజనా చౌదరితో కూడా భేటీ అయ్యారని టాక్ వినపడుతోంది. వంశీతో పాటు, మాజీ మంత్రి రాయలసీమ ఉద్యమాన్ని కొన్నాళ్లు మోసి… టీడీపీలోకి వెళ్లిన బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కూడా బీజేపీ గూటికి చేరబోతున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే వీళ్లిద్దరు డిల్లీలో కండువా కప్పుకోబోతున్నట్లు బీజేపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
అయితే, ఈ చేరికలు మరింతే పెరిగే అవకాశం ఉందంటోంది బీజేపీ. మరి ఈ వలసలను చంద్రబాబు ఎవిధంగా అరికడతారో చూడాలి.