ఎంపీ అరవింద్ పై దాడి ఘటనను బీజేపీ సీరియస్ గా తీసుకుంది. గురువారం నిజామాబాద్ కు వెళ్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్ఎస్ దాడిలో గాయపడిన కార్యకర్తలను, నేతలను ఆయన పరామర్శించనున్నారు. అటు.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో బండి సమావేశమయ్యారు. తెలంగాణలో ప్రజాప్రతినిధులపై జరుగుతున్న దాడుల అంశంపై చర్చించారు.
అంతకుముందు.. పార్టీ కార్యాలయంలో రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండా ఎగురువేశారు సంజయ్. తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ గుండా రాజకీయాలను ప్రోత్సహిస్తూ దాడులకు తెగబడుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలు కావడం లేదన్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా పాలన సాగుతోందని విమర్శలు చేశారు.
అరవింద్ పై దాడిని ఖండించిన బండి.. గురువారం అన్ని జిల్లాల్లో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పాలనలో కవులు, జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆరోపించారు బండి.
ఇక ఎంపీ అరవింద్ మాట్లాడుతూ… తనపై ప్లాన్ ప్రకారం దాడి జరిగిందన్నారు. దీనిపై పోలీసులకు ముందస్తు సమాచారం అందించినా.. సరిగ్గా స్పందించలేదని ఆరోపించారు. ముమ్మాటికీ దాడి చేసింది టీఆర్ఎస్ కార్యకర్తలేనని అన్నారు అరవింద్.