– హుజూరాబాద్ సీన్ రాష్ట్రమంతా..
– 2023లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు
– కమిటీల ఏర్పాటుతో ఆపరేషన్ ఆకర్ష్
– టచ్ లోకి గులాబీ నేతలు!
– వచ్చే రెండేళ్లకు ప్రణాళికలు
హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత మనకు ప్రధాన పోటీదారు బీజేపీనే అనేలా టీఆర్ఎస్ భావిస్తోంది. కేసీఆర్ కేంద్రాన్ని టార్గెట్ చేస్తే.. రాష్ట్ర బీజేపీ నేతలు ఎదురుదాడిలో ఎంతకీ తగ్గడం లేదు. రెండు పార్టీల మధ్య నువ్వా నేనా అనేలా యుద్ధం సాగుతోంది. అయితే.. ఇదంతా డ్రామా అనేది కాంగ్రెస్ వాదన. ఆ విషయాన్ని పక్కనపెడితే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పోరు మాత్రం హైరేంజ్ లో కొనసాగుతోంది. హుజూరాబాద్ లో షాకిచ్చినట్లే వచ్చే ఎన్నికల్లోనూ సత్తా చాటాలని వ్యూహాల్లో ఉంది బీజేపీ.
2023లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు పకడ్బందీ ప్రణాళికలతో సిద్ధం కావడంలో భాగంగా పార్టీలో చేరికలు, సమన్వయం, ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమన్వయానికి మూడు కమిటీలను నియమించింది. తెలంగాణలో బీజేపీని ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని భావించి ఆ దిశగానే ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే చేరికలు వేగవంతం చేయాలని చూస్తున్నారు కమలనాథులు. ఇతర పార్టీల్లో ఉన్న బలమైన క్యాడర్ ని, నాయకులని పార్టీలోకి తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అందుకే ఎన్నడూ రాజకీయాల్లో లేని విధంగా చేరికల కోసం ఒక కమిటీని పెట్టారు. ఆ కమిటీకి బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి చైర్మన్ ని చేశారు. ఇక ఎస్సీ సమన్వయ కమిటీ చైర్మన్ గా మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎస్టీ సమన్వయ కమిటీ చైర్మన్ గా గరికపాటి మోహన్ రావుని నియమించారు.
తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న జాతీయ స్థాయి నేతలు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలే అస్త్రంగా ఆందోళన కార్యక్రమాలకు పథక రచన చేశారు. హుజూరాబాద్ పోరు తర్వాత ఈ విషయంలో బాగా స్పీడ్ పెంచారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో బండి పర్యటనలు, 317పై పోరాటం, నిరుద్యోగుల కోసం నిరసన కార్యక్రమాలు.. ఇవన్నీ ఆ వ్యూహంలో భాగంగానే కనిపిస్తున్నాయి. వచ్చే రెండేళ్లలో కూడా కేసీఆర్ సర్కార్ ను ఉక్కిరిబిక్కిరి చేయాలనే పథకంలో బీజేపీ అగ్ర నాయకులు ఉన్నట్లు చెబుతున్నారు.
బండి సంజయ్ రెండో విడత పాదయాత్రతో పాటు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు కమలనాథులు. ముఖ్యంగా ఆపరేషన్ ఆకర్ష్ ప్రధానాస్త్రంగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. కొన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ నేతలు టచ్ లో ఉన్నారని ఆపార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్న పరిస్థితి. వారిని పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యత చేరికల కమిటీదే. ఇంద్రసేనా రెడ్డికి ఇతర పార్టీల నేతలతో పరిచయాలు బాగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పక్కా ప్లాన్ తోనే బీజేపీ ముందుకు వెళ్తోందని అంటున్నారు విశ్లేషకులు.
మరోవైపు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ పై రేవంత్ రెడ్డి స్పందించాడు. ఇదంతా చూస్తే పార్టీ పని ముగిసిందనే విషయంలో ఎలాంటి డౌట్ లేదంటూ సెటైర్లు వేశారు. ఇతర పార్టీల నుంచి తీసుకున్న నేతలతో కమిటీలు వేయడం చూస్తుంటే ఆ పార్టీ దివాలా తీసిందని విమర్శించారు.