ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు తెలంగాణలో బాగా సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ గారాలపట్టి, ఎమ్మెల్సీ కవిత పేరు ఈ స్కామ్ లో జోరుగా వినిపిస్తుండడంతో.. కారు పార్టీ కంగారు పడుతుంది. దీంతో కమలం వర్సెస్ కారు గా రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కావాలనే సెంట్రల్ సంస్థలతో బిజెపి కక్ష సాధింపు రాజకీయాలకు దిగుతుందని టిఆర్ఎస్ కౌంటర్ ఫైట్ కు దిగుతుంది.

ఈక్రమంలోనే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత పేరును పేర్కొనడంపై టిఆర్ ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేకపోయినా బిజెపి ప్రోద్బలంతోనే ఎమ్మెల్సీ కవితపై ఈడీ ఫేక్ కేసులకు పూనుకుంటుందన్నారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపే అన్న ఆయన ఇటువంటి బెదిరింపులకు భయపడేది లేదన్నారు.
ఇక దేశంలో బిజెపియేతర ప్రభుత్వాలను అస్థిరం చేస్తున్న బిజెపి తెలంగాణలో కూడా అదే విధంగా స్కెచ్ వేసిందని.. దాన్ని ముందుగానే కేసీఆర్ గ్రహించి ఆ కుట్రను భగ్నం చేసినందుకే.. ప్రతీకారంగా మోదీ సర్కార్ ఢిల్లీ లిక్కర్ స్కాంకు స్కెచ్ వేసిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికే ఈ కేసులో కవితను లాగుతున్నారని… ఈ బూటకపు కేసులు నిలబడవన్నారు.
మరో వైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సబంధించి అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించింది. దీనిపై ఇప్పటికే స్పందించిన కవిత బిజెపి.. టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను టార్గెట్ చేసి నీచమైన రాజకీయాలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు.