తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉంటాయనే ప్రచారం ఉంది. దానికి తగ్గట్టే కేసీఆర్ అభివృద్ధి జపం చేస్తుండడంతో అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. శనివారం పోలింగ్ బూత్ కమిటీ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన బండి.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పోలింగ్ బూత్ సభ్యులే ముఖ్యమన్నారు. ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
సరల్ యాప్ ద్వారా కేంద్ర పథకాలు, బీజేపీ కార్యక్రమాలు, కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులను ప్రజల్లోకి తీసుకెళ్ళామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణలో అమలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. ఎన్నికల లిస్ట్ నుండి బీజేపీ వాళ్ళ ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందన్నారు సంజయ్. ఆ లిస్ట్ ను చెక్ చేసుకోవాలని.. ఓట్లను నమోదు చేసుకోవాలని సూచించారు. బూత్ కమిటీ సభ్యుడు బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడు కావొచ్చని.. జాతీయ అధ్యక్షుడు కూడా అవ్వొచ్చని చెప్పారు. కేసీఆర్ కుటుంబం కేంద్ర నిధులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా కేటీఆర్ సవాల్ పై స్పందించారు.
కేంద్ర నిధులపై కేసీఆర్ తో కలిసి చర్చకు సిద్ధమా? అని కేటీఆర్ ను ప్రశ్నించారు బండి. రాజీనామ పత్రం పట్టుకొని కేసీఆర్ తీసుకుని రా అంటూ సవాల్ విసిరారు. గతంలో సవాల్ చేసి తోక ముడుచుకొని పారిపోయారని గుర్తు చేశారు. అభివృద్ధి గురించి మాట్లాడండి.. రాజకీయాలు తర్వాత అంటూ చురకలంటించారు. రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతు బంధు నిధులను బ్యాంకులు తమ ఖాతాలో వేసుకున్నాయని ఆరోపించారు.
హిందూ దేవీ దేవతలను కించపరుస్తూ ఉంటే భరిద్దామా? అని ప్రశ్నించారు బండి. హిందూ దేవతలను అవమానిస్తే.. ఉరికిచ్చి కొట్టే పరిస్థితి వస్తుందని బీఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రహించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక కాంగ్రెస్ ఫిర్యాదుపై తనదైన స్టయిల్ లో ఫైరయ్యారు సంజయ్. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పొత్తు ఉంటుందని మరోసారి బయటపడిందని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ ఎత్తుకుపోయాడని ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఆశ్చర్యంగా ఉందన్న ఆయన.. దొంగలు పడ్డ ఆరు నెలలకు స్పందించినట్టుగా ఉందని ఎద్దేవ చేశారు.