తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తున్న బీజేపీ మరో కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో భారీ ఎత్తున బైక్ ర్యాలీలతో రంగంలోకి దిగింది. బీజేపీని జనాల్లోకి బాగా తీసుకెళ్లటం, క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చెయ్యటంపై దృష్టి సారించాలని నిర్ణయం తీసుకున్న బీజేపీ అధినాయకత్వం నేటి నుండి ప్రజా గోస – బీజేపీ భరోసా బైక్ ర్యాలీలకు శ్రీకారం చుట్టింది. ప్రతిరోజు ఐదారు గ్రామాలలో కొనసాగే ఈ బైక్ ర్యాలీల కార్యాచరణ ఇప్పటికే సిద్ధం చేసిన బీజేపీ నాయకులు నేటి నుండి బైక్ ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా నాంచార్ పల్లిలో బిజెపి తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కుమార్ బైక్ ర్యాలీని ప్రారంభించారు.
ప్రజల బాధలు పోవాలంటే..బీజేపీ అధికారంలోకి రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఉద్యోగులకు ఠంచన్ గా జీతాలు రావాలన్నా..అభివృద్ధి జరగాలన్నా బీజేపీతోనే సాధ్యమన్నారు. దేశ్ కీ నేత..దిన్ బర్ పీతా..ఫాంహౌజ్ మే సోతా..అమాస పున్నానికి ఆతా అంటూ ఎద్దేవా చేశారు. ‘‘ప్రజా గోస –బిజెపి భరోసా‘’ పేరుతో 10 రోజుల పాటు గ్రామాల్లో తిరుగుతూ ప్రజల బాధలు తెలుసుకుని వారికి భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతోనే బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు సంజయ్.
అప్పులపాలైన తెలంగాణలో అభివృద్ధి జరగాలన్నా… సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా… ఫస్ట్ తారీఖున ఠంచన్ గా ఉద్యోగులకు జీతాలు రావాలన్నా బిజెపి అధికారంలోకి వస్తేనే సాధ్యమని తెలిపారు. తెలంగాణ సీఎం ఒకటి, రెండు కాదు… 100 రంగాల్లో నిపుణుడని.. ఇరిగేషన్ ఇంజనీర్ అవతారమెత్తి రీడిజైన్ పేరుతో 30 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష కోట్లకుపైగా ఖర్చు చేసి కట్టి ఊళ్లకు ఊళ్లను ముంచేసిండంటూ బండి ఫైరయ్యారు.
అగడుగునా అవమానించినా అల్లుడికి సిగ్గులేదని..నోటి నిండా అబద్దాలే వల్లిస్తున్నాడంటూ హరీష్ రావుపై మండిపడ్డారు. క్లౌడ్ బరస్ట్ తో అంతర్జాతీయ జోకర్ గా కేసీఆర్ మారాడని విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులు కొల్లగొట్టిన వారికి మద్దతుగా ఆందోళనలు చేయడం సిగ్గుచేటన్నారు. సీఎం కేసీఆర్ కు ఈడీ విచారణ తప్పదని వ్యాఖ్యానించారు.
రైతుబంధు మాత్రమే ఇచ్చి దళితబంధు సహా అన్నింటిని ఆపేశారని బండి సంజయ్ ఆరోనించారు. పంటలకు మద్ధతు ధర పెంచిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదే అని..మోడీ రాక ముందు1310 రూపాయలు ఉన్న మద్ధతు ధర ఇప్పుడు 1960 ఉందని చెప్పారు. తడిసిన ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామిక తెలంగాణ తేవడమే బీజేపీ లక్ష్యమన్నారు. శ్రీలంక పరిస్థితులే రాష్ట్రంలో ఉన్నాయని..ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. విద్యుత్, బస్, పెట్రోల్ చార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్న కేసీఆర్..కేంద్రంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.