కనీసం ఒక్క సీటు గెలవని రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి రాగలిగింది. స్థానిక పార్టీలపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవటంలో బీజేపీ పక్కగా దృష్టిసారిస్తున్న తరుణంలో… అధికారంలోకి వచ్చేందుకు మెరుగైన అవకాశాలు కల్పిస్తున్న తెలంగాణలో పట్టు బిగించేందుకు ఆ పార్టీ దూకుడు పెంచింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితం అయినా, ఎంపీ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలవటంతో పాటు దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, తెలంగాణకు గుండెకాయగా ఉన్న హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు కనిపించటంతో ఇదే దూకుడు కొనసాగించాలని నిర్ణయించింది. ఓవైపు ఇతర పార్టీల్లోని సీనియర్ నేతలను పార్టీలో చేర్చుకుంటూనే… బలపడేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తుంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా పావులు కదుపుతున్న బీజేపీ… త్వరలో పాదయాత్రకు రెడీ అవుతుంది. మొదట బస్సుయాత్ర చేపట్టి 33జిల్లా కేంద్రాలను చుట్టి రానుంది. ఈ బస్సుయాత్రలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రుల వంటి వారిని పార్టీలో చేర్చుకునేందుకు ప్లాన్ చేయగా, ఆ తర్వాత ద్వితీయ శ్రేణి క్యాడర్ కు దగ్గరవ్వటంతో పాటు ప్రజా సమస్యలే లక్ష్యంగా పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ ఉద్యమ హామీలు, టీఆర్ఎస్ పాలనలో నెరవేర్చిన అంశాలను ప్రస్తావిస్తూ పాదయాత్ర సాగించనున్నారు. బస్సుయాత్రలో విజయశాంతి కీరోల్ ప్లే చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఈ రెండు యాత్రలతో గ్రామస్థాయి వరకు పార్టీ బలోపేతం కావటంతో పాటు టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బ్యాంక్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కాదు… బీజేపీ అని ప్రజల్లోకి వెళ్లాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది.