బల్దియా ఎన్నికల్లో బీజేపీ ప్రచార జోరు పెంచింది. ఢిల్లీ నుంచి బీజేపీ అగ్ర నేతలు ప్రచారంలో భాగమవుతున్నారు. శుక్రవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రోడ్ షో నిర్వహించారు. కొత్తపేట నుంచి నాగోల్ వరకు ప్రచారం చేశారు. జోరు వర్షంలోనూ రోడ్ షో కొనసాగుతోంది.
ప్రతి డివిజన్‌లో కమలం జెండా రెపరెపలాడుతుందని, బీజేపీకి అవకాశం ఇవ్వాలని నడ్డా విజ్ఞప్తి చేశారు. ప్రజల స్పందన చూస్తుంటే కేసీఆర్ పాలనకు ముగింపులా అనిపిస్తోందన్నారు. తెలంగాణను అప్పుల మయంగా మార్చారని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కొత్త హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పని అయిపోయిందని, ప్రజలు గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు తగిన గుణపాఠం చెబుతారన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామన్నారు. గల్లీ ఎన్నికలకు ఢిల్లీ నేతలు వస్తున్నారని కేటీఆర్ విమర్శిస్తున్నారని పార్టీని గెలిపించడం కోసం ఎక్కడికైనా వస్తానని అన్నారు. టీఆర్ఎస్ నేతల డ్రామాలు ఇకమీదట సాగవని జేపీ నడ్డా మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనకు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడుతారని చెప్పారు.