అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంపై ఆపార్టీ శ్రేణులు భగ్గుమంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్నారు. అయితే.. కేటీఆర్ ఇలాకాలో బీజేపీ శ్రేణులు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో కేసీఆర్ దిష్టిబొమ్మతో వినూత్న నిరసన తెలిపారు బీజేపీ నేతలు, కార్యకర్తలు. సీఎం దిష్టిబొమ్మను ఎలక్ట్రిక్ స్తంభానికి ఉరి తీశారు. ఓ రోడ్డు మార్గంలో ఉన్న లైటింగ్ పోల్ కి దీన్ని వేలాడదీశారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన బీజేపీ నేతలు.. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. టీఆర్‌ఎస్ నేతలు దోపిడీలో పోటీ పడుతున్నారని విమర్శించారు.
బీజేపీని చూసి కేసీఆర్ భయపడిపోతున్నారని అన్నారు బీజేపీ నేతలు. సీఎం దిష్టిబొమ్మను తాము చేసేందుకు చూస్తే పోలీసులు అడుగడుగునా అడ్డుపడ్డారని చెప్పారు. అదే టీఆర్‌ఎస్ శ్రేణులు పీఎం దిష్టిబొమ్మను దహనం చేస్తే దగ్గరుండి చూసుకున్నారని విమర్శించారు.