మహబూబ్ నగర్ ఎస్పీ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పట్టణానికి చెందిన కొందరు వ్యక్తులు వరుసగా కిడ్నాప్, అరెస్టులకు గురవుతుండడంతో బీజేపీ ధర్నాకు దిగింది. ఈ విషయంలో ఎస్పీ స్పందించాలని ఆయన ఆఫీస్ ను ముట్టడించేందుకు ప్రయత్నించింది.
ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేపీ నాయకులు ,కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరారు. అప్పటికే పోలీసులు భారీగా మోహరించి అందర్నీ అడ్డుకున్నారు. కొందరు మాత్రం తోసుకుంటూ ఎస్పీ ఆఫీస్ ను ముట్టడించారు.
బీజేపీ నేతలు, కార్యకర్తలు ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి మాట్లాడారు.
జిల్లా కేంద్రంలో పలువురు వ్యక్తులు కనిపించకుండా పోయారని అన్నారు. అలాగే ఢిల్లీలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో ఉద్యమ నాయకుడు మున్నూరు రవి సహా ఇతర వ్యక్తులను కిడ్నాప్ చేశారని చెప్పారు. దీని వెనుక మంత్రి శ్రీనివాస్ గౌడ్ హస్తం ఉందని ఆరోపించారు. ఈ కిడ్నాప్ ల వ్యవహారంపై జిల్లా ఎస్పీ స్పందించాలని.. లేదంటే పెద్దఎత్తున ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు వీర బ్రహ్మచారి.