కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లండన్ లో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తన ‘పట్టు’ ను మరింత బిగిస్తోంది. పార్లమెంటులో కన్నా ముందే మొదట ఆయన బయట క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న ఈ పార్టీ.. ఆయన అపాలజీ చెప్పకపోతే ఓ స్పెషల్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి ఎంక్వయిరీ చేబట్టాలని, పార్లమెంట్ నుంచి ఆయనను బహిష్కరించే అవకాశాన్ని కూడా పరిశీలించాల్సిందిగా లోక్ సభ స్పీకర్ ని కోరాలని యోచిస్తోంది. రాహుల్ వ్యాఖ్యలపై ఎంక్వయిరీ చేసేందుకు ప్రత్యేక పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని తాము కోరుతున్నామని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే తెలిపారు.
ఒకవేళ ఇలా ప్రత్యేక పార్లమెంటరీ కమిటీ ఏర్పాటైన పక్షంలో అది నెల రోజుల్లోగా నివేదికను సమర్పించే ఛాన్స్ ఉంది. ఈ కమిటీని ఏర్పాటు చేయాలని తాను స్పీకర్ కి లేఖ రాశానని తెలిపిన దూబే.. 2008 లో యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో ‘క్యాష్ ఫర్ ఓట్స్’ స్కామ్ జరిగినప్పుడు ఈ విధమైన కమిటీని వేశారన్నారు.
నాడు లోక్ సభ నుంచి 10 మంది ఎంపీలను, రాజ్యసభ నుంచి ఒకరిని బహిష్కరించారని ఆయన గుర్తు చేశారు. ఒకవేళ స్పెషల్ కమిటీ ఏర్పాటై.. రాహుల్ మీద చర్య తీసుకున్న పక్షంలో పార్లమెంటులో బీజేపీ సభ్యుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. భారత పార్లమెంటులో విపక్ష ఎంపీల మైక్రోఫోన్లను స్విచాఫ్ చేస్తున్నారని రాహుల్ ఇటీవల లండన్ లో ఆరోపించారు.
పైగా తన కామెంట్ కి ‘మద్దతు’గా ఆయన ..లోపభూయిష్టమైన, పని చేయని ఓ మైక్రోఫోన్ ని వాడారు. ఇండియాలో విపక్షాల గొంతును నొక్కేస్తున్నారని, తమ మైకులు బాగానే ఉన్నా అవి పని చేయకుండా చూస్తున్నారని అన్నారు. పార్లమెంట్ లో తాను మాట్లాడుతున్నప్పుడు ఇలా ఎన్నో సార్లు జరిగిందన్నారు. ఇక రాహుల్ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్న కాంగ్రెస్ నేతలు.. అదానీ వివాదంపై జేపీసీని వేయాలని డిమాండ్ చేస్తుండడంతో.. పరిస్థితి నానాటికీ తీవ్రతరమవుతోంది.