ప్రపంచ దేశాలు ప్రధాని మోడీకి బ్రహ్మరథం పడుతుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. క్లాసిక్ గార్డెన్స్‌లో బీజేపీ హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడారు. పార్లమెంటు కొత్త భవనాన్ని మోడీ ప్రారంభించబోతుంటే ప్రతిపక్షలు జీర్ణించుకోలేకపోతున్నాయని మండిపడ్డారు.
కాంగ్రెస్ సహా ప్రాంతీయ పార్టీలు అనవసరంగా విమర్శలు చేస్తున్నాయన్నారు. మోడీపై విమర్శలు చేస్తే అభాసుపాలు అవుతామన్న సంగతి గమనించలేకపోతున్నారని తెలిపారు. విదేశీ భావజాలం, బ్రిటిష్ భావజాలం ఉన్న పార్టీలే మాట్లాడుతున్నాయని వ్యాఖ్యానించారు. యూపీఏ చైర్మన్‌గా సోనియాగాంధీ ఏ హోదాలో ఇతర దేశాలతో చర్చలు జరిపారు? అని ప్రశ్నించారు.
ఛత్తీస్‌ఘడ్ అసెంబ్లీ భూమి పూజకు ఏ హోదాలో సోనియాగాంధీ వెళ్లారు? ఛత్తీస్‌ఘడ్ గవర్నర్‌ను ఎందుకు పిలవలేదు? ఛత్తీస్‌ఘడ్ గవర్నర్ అనసూయ ఒక గిరిజన మహిళ అయినందునే అవమానించారని భావించాలా..? స్వాతంత్య్రం వచ్చిన నాడు చోళ సంప్రదాయం ప్రకారం తమిళనాడు సంప్రదాయం ప్రకారం ధర్మం దండం మార్పిడి జరిగిందని.. నెహ్రూ అందుకున్న ధర్మ దండం స్పీకర్ దగ్గర ఉంచితే తమిళ ప్రజలను అవమానిస్తున్నారనడం సిగ్గుచేటు అన్నారు.
1985లో పార్లమెంటు కొత్త లైబ్రరీ భవనం రాజీవ్ గాంధీ ప్రారంభించారు… ఆ సమయంలో రాష్ట్రపతిని అవమానించారన్నారు. ఇక తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్‌ను కేసీఆర్ ఆహ్వానించలేదని లక్ష్మణ్ గుర్తుచేశారు.