– ముందస్తు తొందరలో కేసీఆర్!
– టీఆర్ఎస్ కు చెక్ పెట్టేలా బీజేపీ వ్యూహాలు
– అన్నింటినీ సిద్ధం చేస్తూ పావులు
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సరికొత్త చర్చ ఊపందుకుంది. అదే ముందస్తు ఎన్నికలు. అన్ని రాజకీయ పార్టీల్లో ముందస్తుపైనే విశ్లేషణలు నడుస్తున్నాయి. ఎన్నికల స్ట్రాటజీని పక్కాగా అమలు చేసే కేసీఆర్.. మరోసారి తన వ్యూహానికి పదునుపెట్టారని అంటున్నారు విశ్లేషకులు. అయితే.. ప్రతిపక్షాలు కూడా ఈ విషయంలో ఉత్సాహంగానే ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా బీజేపీ ముందస్తుకు మరింత తొందర పడుతున్నట్లు తెలుస్తోంది. దానికి కారణం లేకపోలేదు. ఇటీవల బీజేపీ జాతీయ నాయకత్వం జరిపించిన సర్వేలో ముందస్తు ఎన్నికలు జరిగితే, టీఆర్ఎస్ తట్టాబుట్టా సర్దుకోక తప్పదని స్పష్టమైన సంకేతాలు వచ్చినట్లు సమాచారం.
ఈ సర్వే అధారంగానే బీజేపీ జాతీయ నాయకత్వం, అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని దిక్కుల నుంచి అష్ట దిగ్భందనం చేసేందుకు పావులు కదుపుతోంది. అంతేకాకుండా ఓవైపు ఐటీ, ఈడీ, సీబీఐని బరిలో దించడంతో పాటుగా, నేరుగా జాతీయ నాయకులే రంగంలోకి దిగి, ఇతర పార్టీలలో కీలక నేతలకు కాషాయ కండువాలు కప్పేందుకు సమాయత్తమవుతున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2018 డిసెంబర్ లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్‌ఎస్.. ఒకేసారి 105 మందితో జాబితా ప్రకటించి సంచలనం సృష్టించగా బీజేపీ ఆనాడు అభ్యర్థుల ఖరారులో తీవ్ర జాప్యంతో సమస్యలు ఎదుర్కొంది. ఆ ప్రభావం ఫలితాలపైనా కనిపించింది. కేవలం ఒకే ఒక్క స్థానం నుంచి మాత్రమే గెలిచింది. సుమారు వందకు పైగా స్థానాల్లో డిపాజిట్ దక్కలేదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఎలాగైనా రాష్ట్రంలో అధికారం చేపట్టాలని ఉవ్విల్లూరుతూ.. అందుకోసం శత విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది.
జులై తొలివారంలో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న అధిష్టానం ప్లాన్ రెడీ చేసుకుంటోంది. తెలంగాణలో బీజేపీ రాజకీయ ఎదుగుదలకు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అందుకు అవసరమైన కార్యాచరణ అమలు చేస్తోంది. రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి ప్రత్నామ్యాయం బీజేపీనే అనే ప్రచారాన్ని వివిధ రూపాల్లో నిర్వహించాలని నిర్ణయించింది. జులై 1, 2, 3 తేదీల్లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి అవసరమైన రోడ్ మ్యాప్ ను నిర్దేశించనుందనే ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్య క్షుడు జేపీ నడ్డా తెలంగాణకు ఇస్తున్న ప్రాధాన్యతను గురించి రాష్ట్ర నాయకులు వివరించనున్నారు.
తెలంగాణపై పట్టు సాధించడం కోసం ప్రత్యర్థి పార్టీలలో ఇమడలేని నేతలను టార్గెట్ చేసి పార్టీలో చేర్చుకునే పనిలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తుకు వెళ్తామని స్వయంగా ప్రకటించలేదు. ప్రస్తుతానికి ముందస్తు ‘కీ’ కేసీఆర్ చేతిలోనే ఉంది. కొన్నాళ్లుగా పొలిటికల్ గా స్పీడ్ పెంచారు. ఎమ్మెల్యేలను జిల్లాల బాట పట్టించారు. కేటీఆర్ కూడా వార్నింగులు ఇస్తున్నారు. ఇవన్నీ ముందస్తు సంకేతాలేనని బీజేపీ భావిస్తోంది. పైగా ఇంటెలిజెన్స్ కూడా ఏదో జరుగుతోందని సమాచారం అందించింది. ఈ నేపథ్యంలో అన్నింటికీ సిద్ధం అవుతున్నారు కమలనాథులు.