కాంగ్రెస్ సీనియర్ నేతలు కపిల్ సిబల్, గులాం నబీ ఆజాద్ బీజేపీలో చేరాలని ఆహ్వానించారు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే. కాంగ్రెస్ కోసం వారిద్దరు ఎంతో చేశారని.. కష్టపడి పార్టీని నిర్మించారని ఆయన అన్నారు. అంత చేసిన వారికి పార్టీలో గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను నిలబెట్టినవారిపై ఆరోపణలు చేయడం రాహుల్ గాంధీకి తగదని చెప్పారు. ఒకవేళ రాహుల్ వారిపై అలాగే ఆరోపణలు చేస్తే.. వెంటనే కాంగ్రెస్ నుంచి బయటకు రావాలని సూచించారు. బీజేపీ వారిని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు.
ఇటీవల కాంగ్రెస్ పార్టీలోని 23 మంది సీనియర్ నేతలు పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాసిన వ్యవహారం ఆ పార్టీలో దుమారం రేపింది. ఆ లేఖపై సీడబ్ల్యూసీ సమావేశంలో తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ బీజేపీతో కుమ్మక్కయ్యారని రాహుల్ ఆరోపణలు చేసినట్టు ప్రచారం జరిగింది.