త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు గాను 48 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ శనివారం ప్రకటించింది. మరో 12 స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని పేర్కొంది.
అభ్యర్థుల జాబితాను పార్టీ సీనియర్ నేతలు అనిల్ బలూనీ, సంబిత్ పాత్రోలు మీడియా సమావేశంలో విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ భట్టాచార్జీ తెలిపారు. మొత్తం 60 స్థానాల్లో తమ అభ్యర్థులు నామినేషన్లు వేస్తారని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి మాణిక్ సాహా బార్డోవాలి స్థానం నుంచి పోటీ చేయనున్నారు. కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్ ధన్ పూర్ నియోజక వర్గంల నుంచి బరిలో దిగనున్నారు. పార్టీ అధ్యక్షుడు రాజీవ్ భట్టాచార్జీ బనమలీ నుంచి పోటీలో దిగనున్నారు.
మాజీ కాంగ్రెస్ నాయకుడు, రాజ వంశీయుడు ప్రద్యోత్ దేబ్ బర్మాన్ స్థాపించిన ప్రాంతీయ పార్టీ టిప్రాతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ భావించింది. ఈ క్రమంలో టిప్రాతో బీజేపీ నేతలు చర్చలు జరిపారు. తాజాగా టిప్రాతో పొత్తులు లేనట్టేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.