మూడు ఈశాన్య రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ హవా స్పష్టంగా కనిపించింది. త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఈ పార్టీ తిరిగి అధికార పగ్గాలను చేబట్టనుండగా మేఘాలయాలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రానందున ఇక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో సీఎం కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ 26 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.
నాగాలాండ్ లో బీజేపీ- ఎన్డీపీపీ కూటమి తొలి రౌండ్ నుంచే దూసుకుపోతూ వచ్చింది. త్రిపురలో బీజేపీ, దాని మిత్ర పక్షాలు మెజారిటీ మార్క్ 31 ని దాటి కొంత ముందుకు వెళ్ళాయి. ఇక్కడ లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి ఓటమి అంచుల్లో ఉంది. ఇక తిప్రా మోథా 10 కి పైగా సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఈ పార్టీని ‘బుజ్జగించేందుకు’ స్థానిక బీజేపీ నాయకత్వం అప్పుడే యత్నాలు ప్రారంభించింది. మేఘాలయలో మెజారిటీ మార్క్ 31 కి నేషనల్ పీపుల్స్ పార్టీ ఇంకా అందనంత దూరంలో ఉంది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నాలుగేసి సీట్లలో ముందంజలో ఉండగా తృణమూల్ కాంగ్రెస్ ఏడు స్థానాల్లో లీడింగ్ లో ఉంది.
త్రిపుర రాజధాని అగర్తల లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో అప్పుడే పార్టీ కార్యకర్తలు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. రాష్ట్రంలో 15 సీట్లలో ఈ పార్టీ విజయం సాధించి మరో 18 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ విజయోత్సవాల్లో సీఎం మాణిక్ సాహా, మాజీ సీఎం, పార్టీ ఎంపీ బిప్లబ్ దేబ్, పార్టీ నేత సాంబిత్ పాత్రా కూడా పాల్గొన్నారు. రెండో సారి తమ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మాణిక్ సాహా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఫలితాలపై స్పందించిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.. మేం ఈ ఎన్నికల్లో విజయం సాధించామంటే ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా పొందినట్టేనని అన్నారు. ఈశాన్యం లోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ‘ఇంపాక్ట్’ స్పష్టంగా కనబడుతోందన్నారు.