ఢిల్లీలో ఓ వైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతుండగా మరోవైపు పార్టీ లేదా, ప్రధాని మోడీ ఇన్నేళ్లలో సాధించిన విజయాలతో కూర్చిన స్పెషల్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటోంది. ‘విశ్వగురు భారత్’, (గ్లోబల్ లీడర్ ఇండియా), ‘సంవాహక్’,, (క్యారియర్ లేదా అంబాసిడర్), ‘సేవా.. వా సమర్పణ్’ (సర్వీస్, డెడికేషన్), ‘సంఘర్ష్ సే సిద్ధి’ (ఫ్రమ్ స్ట్రగుల్ టు ఫుల్ ఫిల్ మెంట్) అనే నాలుగు థీమ్ లతో ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. అంటే మోడీని విశ్వగురువుగా, ఇండియాను ఉత్తమ సాంస్కృతిక దేశంగా, ప్రజలకు విశేష సేవలందిస్తున్న దేశంగా పేర్కొన్నారు. అలాగే ఎన్నో ఆటంకాల తరువాత భారత ప్రజల ఆశయాలను నెరవేర్చిన పార్టీగా అభివర్ణించారు.
పార్టీ అధ్యక్షుడు జేపీ. నడ్డా ప్రారంభించిన ఈ ఎగ్జిబిషన్.. మోడీ నాయకత్వం కింద ఈ ఏడేళ్లలో వివిధ లక్ష్యాలను ఎలా సాధించామో ప్రతిబింబిస్తోంది. ప్రతి ఏడాదీ జూన్ 21 ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పాటించేలా ఐరాస ఓ తీర్మానాన్ని ఆమోదించడంలో మోడీ చేసిన కృషి, రష్యా వార్ నేపథ్యంలో ఉక్రెయిన్ లో చిక్కుబడిన భారతీయులను, విద్యార్థులను ఇండియాకు ప్రత్యేక విమానాల్లో రప్పించేందుకు చూపిన చొరవ వంటివాటిని ఈ ఎగ్జిబిషన్ లో హైలైట్ చేశారు.
ఇక కరోనా పాండమిక్ సమయంలో విదేశాలకు మందులు, వ్యాక్సిన్ ను పంపి వాటికి సాయమందించిన భారత ప్రభుత్వ కృషికి సంబంధించి.. ఫోటోలు కూడా ఇందులో ఉన్నాయి. 2015 లో యెమెన్ సంక్షోభ సమయంలో అక్కడినుంచి వేలాదిమంది భారతీయులను స్వదేశానికి రప్పించిన ఘట్టాన్ని కూడా ప్రస్తావించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం, కాశీ-విశ్వనాధ్ కారిడార్ అభివృద్ధి, కాంబోడియాలో అంగ్ కోర్ వాట్ పునరుద్ధరణ, ఉజ్జయిని లో మహాకాల్ లోక్ ప్రాజెక్టు, మనామాలో కృష్ణాలయ పునరుద్ధరణ, ఇంకా చోరీకి గురైన పురావస్తు ప్రాధాన్యం గల వస్తువులను తిరిగి ఇండియాకు తెప్పించడంలో చేసిన కృషి ‘కల్చరల్ విజయాలు’ గా పేర్కొన్నారు.
బీజేపీ ప్రభుత్వం చేబట్టిన ముద్రా యోజన, పీఎం స్వానిధి యోజన, స్టాండప్ ఇండియా, పీఎం కిసాన్ సమ్మాన్ యోజన వంటి వివిధ పథకాలను ఈ ఎగ్జిబిషన్ లో ప్రస్తావిస్తూ.. వీటికి సంబంధించిన ఫోటోలను ఏర్పాటు చేశారు.