సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కేసీఆర్ వెంట వాళ్లు నడవనున్నారు.. వీళ్లు టచ్ లో ఉన్నారు అంటూ కథనాలు వస్తున్నాయి. అయితే, టీఆర్ఎస్ నేతలతో ఏపీ బీజేపీ లీడర్స్ టచ్ లో ఉన్నారనే ప్రచారం.. ఆపార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కు కోపం తెప్పించింది.
జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ఏపీలో ఏ ఒక్క బీజేపీ కార్యకర్తనన్నా మీరు పెట్టబోతున్న బీఆర్ఎస్(భారతీయ బార్ అండ్ రెస్టారెంట్ సమితి) పార్టీలోకి లాక్కోగలిగితే నేను ముక్కు నేలకు రాస్తా’’ అంటూ సత్యకుమార్ ఛాలెంజ్ చేశారు.
ఈ సందర్భంగా మరో అంశాన్ని కూడా సత్యకుమార్ లేవనెత్తారు. ‘‘మీరు పుట్టిన కాంగ్రెస్, పెరిగిన టీడీపీ, తోడు దొంగ వైసీపీతో ట్రై చేసుకోండి. అక్కడ ఒకరో ఇద్దరో తలమాసినోళ్లు దొరక్కపోరు’’ అంటూ సెటైర్లు వేశారు.
ఇక కేసీఆర్ జాతీయ పార్టీ సక్సెస్ కావాలని వరంగల్ జిల్లాలో హమాలీలకు టీఆర్ఎస్ నేత మద్యం, కోళ్లు పంపిణీ చేయడంపైనా సత్యకుమార్ చురకలంటించారు. కేసీఆర్ కొత్త పార్టీ పాలసీ “బార్ అండ్ రెస్టారెంట్ సమితి” అని ఇది కేసీఆర్, కేటీఆర్ దార్శనికతకు అభినందనలు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇలాంటి వ్యక్తులు కేంద్రంలో అధికారంలోకి వస్తే “హర్ నల్ సే జల్” పథకం స్థానంలో “హర్ నల్ సే ఆల్కహాల్” స్కీమ్ తీసుకువస్తారంటూ విమర్శలు గుప్పించారు.